గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ టైగర్‌ ఉడ్స్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో ఆయన కారు బోల్తా పడింది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7.12 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో కారులో ఆయన ఒక్కరే ఉన్నారు. కారు బోల్తా పడడంతో వెంటనే బెలూన్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న లాస్‌ఏంజిల్స్‌ అగ్నిమాపక సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది ఆయనను కారు నుంచి వెలుపలికి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారు ఒక పక్క పూర్తిగా ధ్వంసమైంది. ఉడ్స్‌ కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
45 ఏళ్ల టైగర్‌ ఉడ్స్‌ ఇప్పటివరకు పీజీఏలో 82 టైటిళ్లు సొంతం చేసుకున్నారు. 15 మేజర్‌ ఛాంపియన్‌షిఫ్‌లను కైవసం చేసుకున్నారు. ఇందులో ఐదు మాస్టర్‌ టోర్నమెంట్‌లు సైతం ఉన్నాయి. 2009లో ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో కూడా ఉడ్స్‌ గాయపడ్డారు.