విశాఖ జిల్లా మద్దిలపాలెం సమీపంలోని నక్కవానిపాలెం వద్ద రౌడీ షీటర్‌ వెంకట్‌రెడ్డి అలియాస్‌ బండ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇనుపరాడ్డులు, కత్తులతో దారుణంగా దాడి పొడిచి చంపారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి బండరెడ్డి కేఆర్ఎం కాలనీలోని తన నివాసానికి సమీపంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌పై కూర్చొని ఉన్నారు. ఈ సమయంలో ద్విచక్రవాహనంలో ఇద్దరు వ్యక్తులు, కారులో ఇద్దరు వ్యక్తులు వచ్చి బండరెడ్డిపై ఇనుపరాడ్డులతో ఒక్కసారిగా దాడికి దిగారు. తలపై బలంగా గాయం కావడంతో బండరెడ్డి కిందపడ్డారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రరక్తస్రావం అయి బండరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు.

అయితే గతంలో నేర చరిత్ర ఉన్న బండరెడ్డి డబ్బులు తీసుకొని నేరాలు చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. గతంలో రెండు హత్య కేసుల్లో బండరెడ్డి పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తనతో పాటే తిరిగిన వ్యక్తులు ఆధిపత్యం కోసం ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఇటీవల కాలంలో బండరెడ్డితో పాటు సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులతో తనకు విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో ఇద్దరు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించినట్లు సమాచారం. బండరెడ్డి 10 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.