చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతూపోవడం వల్ల ఆర్టీసీకి అధిక వ్యయం అవుతుంది. ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు ఆకాశాన్నంటుతున్న డీజిల్‌ ధరలు మరింత భారంగా మారడం వల్ల ఏడాదికి సుమారు 20 లక్షల కిలో లీటర్ల డీజిల్ వినియోగిస్తున్న ఆర్టీసీపై పెరిగిన ధరలతో దాదాపు రూ.350 కోట్ల భారం పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 డిపోల పరిధిలో ప్రయాణికుల కోసం దాదాపు 9754 బస్సులను తిప్పుతున్నారు. డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ తదితర పన్నులు సంస్థకు అధిక భారంగా మారాయి. లాక్‌డౌన్‌ తర్వాత పూర్తిస్థాయిలో బస్సులు రోడ్ మీదకు రావడం వల్ల పెరిగిన ధరలతో వాటిని తిప్పేందుకు అధిక వ్యయం ఖర్చవుతోంది.

ఆర్టీసీకి చెందిన ఆర్థిక వనరులు కరిగిపోవడం కారణంగా ఉద్యోగులకు జీతాలు రెండు వారాలు ఆలస్యంగా ఇస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు డీజిల్‌ ధరలు పెరుగుతూపోతే ఇకముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్ తదితర పన్నులు రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రయాణికులపై ఆ భారం పడకుండా ప్రభుత్వాలే భరించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఛార్జీలు పెంచుకుంటూ పోతే ప్రజలు ఆర్టీసీకి ప్రత్యామ్నాయాలు వెతుక్కునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.