టాప్ స్టోరీస్ (Top Stories)

ఏపీలో జియో…లాభమా? నష్టమా?

మొబైల్ రంగంలో జియో విప్లవం అంతతేలిగ్గా ఎవరికీ అర్థం కాలేదు. ఆరునెలలు ఉచిత సేవలంటూ మొదలు పెట్టగా సర్వీస్ ప్రొవైడర్లు అతలాకుతలం అయిపోయారు. జియో అనే పేరు తప్ప ఇంకేదీ వినిపించడాం మానేసింది. వోడాఫోన్, ఐడియా కలిసినా ప్రయోజనం చేకూరలేదు, బీఎస్ఎన్ఎల్ అయితే ఇక పూర్తిగా నిర్వీర్యమైంది. ఎయిర్ టెల్ ఒక్కటే నష్టాల్లో ఉన్నా పోరాటం చేస్తోంది, మిగతా పేర్లన్నీ మటుమాయం అయిపోయాయని చెప్పొచ్చు. తీరా ఇప్పుడు జియో నెట్ వర్క్ స్పీడ్ తగ్గించేయడం, చార్జీలు పెంచేయడం, పాత ప్లాన్లకు మంగళం పాడటంతో కస్టమర్లు వేరే ఆప్షన్ లేక జియోతోటే నడుస్తున్నారు. ఎయిర్ టెల్ ఒక్కటీ మార్కెట్లో ఉంది కాబట్టి సరిపోయింది, అదీ లేకపోతే.. జిఓ తప్ప వేరే మార్గం లేకుండా పోయేది.

సెల్ ఫోన్ రంగంతోపాటు.. బ్రాడ్ బ్యాండ్ సేవల్లో కూడా జియో ప్రత్యర్థుల్ని దెబ్బకొట్టింది. అధునాతన టెక్నాలజీ పరిచయం చేస్తూ దూసుకెళ్లింది. జియో దెబ్బకి దాదాపుగా అన్ని పట్టణ ప్రాంతాల్లోనూ చిన్న చిన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు మూతబడ్డాయి. ఇప్పుడిక కేబుల్ ప్రసారాలపై జియో దృష్టి సారించింది. కేబుల్, ఇంటర్నెట్.. ఈ రెండిటినీ కలిపి మరో విప్లవానికి సిద్ధమైంది.

ఇప్పటికే దేశవ్యాప్తంగా జియో కేబుళ్లు ఊరూవాడా వెళ్లిపోయాయి. స్థానికంగా ఉండే కేబుల్ ఆపరేటర్లు జియో దెబ్బకి భయపడుతున్నారు. డిజిటల్ లైసెన్స్ లేకపోవడంతో.. ఏపీలో హాత్ వే ద్వారా తన ప్రసారాలు ఇవ్వబోతోంది జియో. అత్యాధునికమైన సెట్ టాప్ బాక్స్, అత్యంత నాణ్యమైన ప్రసారాలు, ఆటంకంలేని సర్వీస్ లు, లెక్కలేనన్ని ఛానెల్స్, అదనంగా ఇంటర్నెట్.. తక్కువ ధరకే ఇవన్నీ వస్తే ఇంకేం కావాలి. అందుకే ప్రజలంతా జియో వైపే మొగ్గు చూపుతున్నారు, ఆపరేటర్లు కూడా ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు.

జిల్లాల్లో కేబుల్ ఆపరేటర్లు గతంలో తమకు సిగ్నల్ ఇస్తున్న యాక్ట్, సిటీ కేబుల్, ఇతరత్రా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని వారితోనే కలసి నడుస్తున్నారు. సడన్ గా జియో వచ్చి కాంపిటీషన్ పెడతామంటే వారంతా హడలిపోతున్నారు. 80శాతం కనెక్షన్లు మాకిస్తారా లేక మీ ప్రాంతంలో మీకు పోటీగా మరో ఆపరేటర్ ని దించమంటారా.. అంటూ అడుగుతున్నారు. మరో దారిలేక అందరూ జియోకి సాహో అంటున్నారు. అంటే దాదాపుగా ఏపీలో జియో ఏకఛత్రాధిపత్యం మొదలైనట్టే లెక్క.

కేబుల్ ప్రసారాలు, ఇంటర్నెట్ కలిపి ఏపీ ఫైబర్ నెట్ పేరుతో గత ప్రభుత్వం ఇంటింటికీ తక్కువ రేటుకే రెండు సర్వీసుల్ని అందించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నష్టాలబాట పట్టింది. కస్టమర్ కి తక్కువరేటుకే సేవలు అందుతున్నాకూడా లాభాలన్నీ మధ్యవర్తుల చేతుల్లోకే వెళ్లిపోతున్నాయి.
ప్రభుత్వ మేనేజ్ మెంట్ అయితే పూర్తిగా విఫలం అయింది. ఇప్పటికి కూడా ఏపీ ఫైబర్ నెట్ ఏమాత్రం కోలుకోలేదంటే.. గతంలో దాన్ని ఎంతలా నాశనం చేశారో అర్థం చేసుకోవచ్చు. జియో పూర్తిస్థాయిలో వస్తే ఫైబర్ నెట్ కనెక్షన్లు కూడా పీకిపారేయాల్సిందే.

ప్రస్తుతం తక్కువ రేటుకే అన్ని సేవలు వస్తున్నాయని కస్టమర్ సంతోష పడొచ్చు కానీ, భవిష్యత్తులో జియో వడ్డింపులని మాత్రం అంత తేలిగ్గా తీసిపారేయలేం. మొబైల్ సర్వీస్ ల విషయంలో జియో మాస్టర్ ప్లాన్ అందరికీ తెలిసిందే. ఇదే ప్లాన్ ని కేబుల్ కనెక్షన్ల విషయంలో కూడా అప్లై చేయబోతోంది అని సమాచారం. అయితే మొబైల్ రంగంలో జియోని ఢీకొట్టి నిలబడినట్టుగా ఎయిర్ టెల్ లాంటి బలమైన సంస్థలేవీ కేబుల్ రంగంలో లేవు. జియో తీసుకొస్తున్న నూతన టెక్నాలజీకి అవి పోటీ ఇవ్వలేకపోతున్నాయి.
దీంతో జియో నియంతృత్వం మెల్లమెల్లగా మొదలవుతోంది. డీటీహెచ్ లు కూడా రేట్లు పెంచి, ఛానెళ్ల సంఖ్యను తగ్గించేయడంతో ప్రజలెవరూ వాటిపై దృష్టి పెట్టడంలేదు. పూర్తిగా కేబుల్ ప్రసారాలు జియో హస్తగతం అయితే.. ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా తప్పించుకోలేని/కాదనలేని మరో కొత్త మార్పుని మనం త్వరలోనే చూస్తామన్నమాట.ఇది మంచికో…చెడుకో….మీరే నిర్ణయించండి!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.