క్రైమ్ (Crime)

భార్యపై కోపంతో 7 నెలల పసివాడిని హతమార్చిన తండ్రి

మద్యం మత్తు అతనిలోని రాక్షసత్వాన్ని మేల్కొలిపింది. దానికి అనుమానం తోడైంది. భార్యపై కోపంతో ఊయలలో నిద్రపోతున్న ఏడు నెలల పసివాడిని తీసుకుని అమాంతం నేలకేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు వదిలాడు.. ఈ దారుణం కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణం కొత్తకోడూరు కాలనీలో సోమవారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది. సీఐ ఆనందరావు, ఎస్సై పెద్దఓబన్న తెలిపిన వివరాల మేరకు.. కాలనీకి చెందిన అల్లం వెంకటరమణ (40) పట్టణంలో ఆటోడ్రైవరుగా పనిచేస్తుంటాడు. ఇతడు ఓ మహిళతో కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఏడు నెలల కుమారుడు శివ ఉన్నాడు. వీరు కొత్తకోడూరులో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఏడాదిగా ఉంటున్నారు. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో వెంకటరమణ ఆమెతో గొడవకు దిగాడు. అర్ధరాత్రి సమయానికి గొడవ పెరిగింది. ఆమెపై చేసిన అనుమానపు దూషణలు ఘర్షణకు దారితీశాయి. ఆమె మీద కోపం ఊయలలో నిద్రిస్తున్న చిన్నారిపైకి మళ్లింది. ఒక్కసారిగా బిడ్డను ఎత్తుకొని బయటకు వెళ్లిన తండ్రి ఆ పసికందును నేలకేసి బాదాడు. తీవ్ర గాయాలపాలైన చిన్నారిని తల్లి హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లింది. అయితే అక్కడికి చేరుకునేలోపే బిడ్డ చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం వెంకటరమణను అరెస్టు చేసి, హత్య కేసు నమోదు చేశారు. చిన్నారి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మత్తు దిగాక తన బిడ్డను తానే చంపుకున్నానని అంటూ నిందితుడు పోలీస్‌స్టేషన్లో కుమిలిపోయాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.