న్యాయవాదులు వామన్‌రావు దంపతులను అనుసరించి వచ్చిన నిందితులు కొద్దినిమిషాల్లోనే నడిరోడ్డు మీద వారిద్దరినీ ఘోరంగా నరికి చంపి ఏమీ జరగనట్లే అక్కడి నుంచి జారుకున్నట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుంది. ఆ రాత్రికి కారులోనే ప్రశాంతంగా నిద్రపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి వారు మంథనిలో న్యాయస్థానానికి అందజేసిన నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పలు ఆసక్తికర విషయాలున్నాయి. కల్వచర్ల సమీపంలో వామన్‌రావు, నాగమణిలను హత్య చేసిన అనంతరం నిందితులు నేరుగా కారులో సుందిళ్ల బ్యారేజీకి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు రక్తసిక్తమైన తమ దుస్తులను బ్యారేజీలో పడేశారు. బ్యారేజీ నుంచి కారులో వాంకిడి చెక్‌పోస్టు వద్దకు చేరుకుని ఆ రాత్రికి నిందితులు వాహనంలోనే పడుకున్నారు. ప్రస్తుత రిమాండ్‌ రిపోర్టును బట్టి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని తెలుస్తోంది. ఈ మొత్తం కేసులో బిట్టు శ్రీను పాత్ర ఏమిటి అనేది అతడికి సంబంధించిన రిమాండ్‌ డైరీ ద్వారా వెల్లడయ్యే అవకాశముంది.

కుంట శ్రీనుపై కేసులు, ఫిర్యాదుల గురించి వామన్‌రావు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. కుంట శ్రీను దీనిపై ఫోన్‌లో బెదిరించడంతో వామన్‌రావు అతడిపై హైదరాబాద్‌ వెస్ట్‌మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టారు. మంథని ఠాణాలోనూ కుంట శ్రీనుపై పదుల సంఖ్యలో ఫిర్యాదులుచేశారు. శ్రీను గుంజపడుగు బస్టాండ్‌ వద్ద స్థలాన్ని కొని భవనం, సమీపంలోనే గుడిని నిర్మిస్తున్నాడు. దీంతో పాటు రాధాగోపాలస్వామి ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయగా.. వీటన్నింటినీ అడ్డుకునేందుకు వామన్‌రావు కేసులు వేయడంతో శ్రీనుకు అతడికి మధ్య వివాదం బాగా ముదిరింది. వామన్‌రావు విషయమై కుంట శ్రీను పలుమార్లు బిట్టు శ్రీనుతో చర్చించి చివరకు ఎలాగైనా, ఎప్పుడైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు.
గుంజపడుగు గ్రామంలో ఈనెల 17న జరిగిన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కుంట శ్రీను తర్వాత దుబ్బపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యాడు. మంథని చౌరస్తాకు వచ్చేసరికి వామన్‌రావు దంపతులు కారులో మంథని కోర్టుకు వెళ్తుండడం కనిపించింది. వెంటనే బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పాడు. అతడు హత్య చేయడానికి కత్తులు, కారు, డ్రైవర్‌ చిరంజీవితో పాటు కోర్టు వద్ద రెక్కీకి లచ్చయ్య, కుమార్‌లను ఏర్పాటు చేశాడు.

ఈ నెల 17న (హత్యలు జరిగిన రోజు) కుంట శ్రీను, బిట్టు శ్రీను, లచ్చయ్య, అక్కపాక కుమార్‌ల మధ్య మొత్తం 18 సార్లు సెల్‌ఫోన్‌ సంభాషణలు నడిచాయి. బిట్టు శ్రీను-కుంట శ్రీను మధ్య 11 సార్లు, కుంట శ్రీను- వూదరి లచ్చయ్య మధ్య 5 సార్లు కాల్స్‌ వెళ్లాయి. బిట్టు శ్రీను, కుంట శ్రీను చెరోసారి కుమార్‌తో మాట్లాడారు.

హత్యల కోసం బిట్టు శ్రీను మంథనిలో కత్తులు తయారు చేయించాడు. వాటిని తయారుచేసి ఇచ్చిన రఘు, శ్రీను, బాబులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కులవృత్తిపరంగా కత్తులు తయారు చేశామే తప్ప హత్యకు ఉపయోగిస్తారనే విషయం తమకేం తెలుసంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వామన్‌రావు తండ్రి కిషన్‌రావుతో పాటు ఘటనా స్థలంలో హత్యను వీడియో చిత్రీకరించిన ఓ విలేకరి నుంచి కూడా వాంగ్మూలం తీసుకోవాలని పోలీసులు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.