దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీలో ఉదయం సాంకేతిక సమస్య తలెత్తడంతో ఉదయం 11:40 గంటల సమయంలో ట్రేడింగ్‌ నిలిపివేశారు. దీంతో ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాలని నిర్ణయించారు. సాయంత్రం 3:45 గంటలకు సెన్సెక్స్‌, నిప్టీ ట్రేడింగ్‌ను పునఃప్రారంభించారు. తర్వాత సూచీల భారీ లాభాల దిశగా దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ 50,881-49,648 మధ్య కదలాడింది. నిఫ్టీ 14,723 వద్ద కనిష్ఠాన్ని, 15,008 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. దీంతో సెన్సెక్స్‌ 50 వేలు, నిఫ్టీ 15,000 పాయింట్ల కీలక మైలురాయిని మరోసారి తాకాయి. చివరకు సెన్సెక్స్‌ 1,030 పాయింట్ల లాభంతో 50,781 వద్ద ముగిసింది. నిఫ్టీ 279 పాయింట్లు పైకి ఎగసి 14,987 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.72.36 వద్ద నిలిచింది. అంతకుముందు నిఫ్టీ ట్రేడింగ్‌ ఆగిపోవడంతో అన్ని ఓపెనింగ్‌ ఆర్డర్లను నిలిపివేశారు. ఈ నెల డెరైవేటివ్‌ల కాంట్రాక్టు గడువు రేపే ముగియనుండడంతో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ ట్రేడర్లలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే ట్రేడింగ్‌ సమయాన్ని పొడిగించాలని నిర్ణయించారు. 

పునఃప్రారంభం తర్వాత సూచీలకు బ్యాంకింగ్‌, ఆర్థిక, ఇంధన, టెలికాం, పీఎస్‌యూ రంగాల షేర్ల అండ లభించడంతో భారీ లాభాలు పుంజుకున్నాయి. ఇకపై ప్రభుత్వ వ్యాపార కార్యకలాపాలను ప్రైవేటు బ్యాంకులు కూడా నిర్వహించొచ్చన్న కేంద్రం నిర్ణయం నేపథ్యంలో ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇది కూడా సూచీల దూకుడుకు కారణమైంది. కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు భారీగా లాభపడగా.. యూపీఎల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి