ఈ ఏడాది భారత్‌లో వేతనాలు సగటున 7.7 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఓ నివేదిక పేర్కొంది. బ్రిక్‌ దేశాలన్నింటిలోనూ భారత్‌లోనే వేతనాల పెంపు ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 2020లో భారత్‌లో వేతనాలు సగటున 6.1 శాతం మేర పెరిగాయని వివరించింది. అంతర్జాతీయ వృత్తి నిపుణుల సేవల సంస్థ ఎయాన్‌ పీఎల్‌సీ ఈ నివేదికను రూపొందించింది. దేశవ్యాప్తంగా 20 పరిశ్రామిక రంగాల్లోని 1,200 కంపెనీలపై జరిపిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ‘వ్యాపార కార్యకలాపాలపై కరోనా ప్రభావం ఏమేరకు పడిందనే విషయంపై పూర్తి అవగాహన వచ్చాక వేతనాల పెంపు అంశాన్ని కంపెనీలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే పెంచిన వేతనం పూర్తిగా ఉద్యోగుల చేతికి ఇవ్వకుండా, అందులో కొంత డబ్బును కొత్త వేతన నిర్వచనం ప్రకారం ఎక్కువ మొత్తంలో భవిష్య నిధి చందా కట్టేందుకు వాడే అవకాశాలూ ఉన్నాయ’ని ఎయాన్‌ ఇండియా (పర్‌ఫెర్మాన్స్, ప్రోత్సాహకాల విభాగం) సీఈఓ నితిన్‌ సేథి అన్నారు. నివేదికలో ఇంకా ఏముందంటే.

2021లో వేతనాలను పెంచే ఉద్దేశంలో ఉన్నట్లు 88 శాతం కంపెనీలు సర్వేలో వెల్లడించాయి. 2020లో వేతనాల పెంపు వైపు మొగ్గు చూపిన సంస్థలు 75 శాతమే.
ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందనడానికి చాలా కంపెనీలు వేతనాల పెంపు దిశగా యోచన చేస్తుండటమే ఓ నిదర్శనమని సర్వే తెలిపింది.
ఇ-కామర్స్, వెంచర్‌ కేపిటల్, హై-టెక్‌/ ఐటీ సాంకేతికత, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో వేతనాల పెంపు ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది. ఆతిథ్యం/ రెస్టారెంట్లు, స్థిరాస్తి, మౌలిక రంగాలు, ఇంజినీరింగ్‌ సేవల కంపెనీల్లో వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండొచ్చని సర్వేలో తేలింది.
గత కొన్నేళ్లతో పోలిస్తే వలసల రేటు (12.8%) చాలా తక్కువగా ఉందని కూడా సర్వే గుర్తించింది. ఆచితూచి నిర్ణయం తీసుకునేందుకు ఉద్యోగులు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారే వాళ్ల సంఖ్య కూడా పెద్దగా ఉండకపోవచ్చని తెలిపింది.
2020లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలకు నిర్ణయం తీసుకున్నప్పటికీ బ్రిక్స్‌ దేశాలన్నింటిలో భారత్‌లో అత్యధిక వేతనాల పెంపు ధోరణి కొనసాగొచ్చని నివేదిక వెల్లడించింది.