స్టాక్‌ మార్కెట్లను కరోనా రెండో వేవ్‌ భయం ప్రభావితం చేసింది. దీంతో నేడు సూచీలు భారీగా నష్టపోయాయి. ఉదయం ప్రారంభమే ప్రతికూలంగా మొదలైన సూచీలు ఏ దశలోనూ పుంజుకోలేదు. సమయం గడుస్తున్న కొద్దీ అమ్మకాలు వెల్లువెత్తడంతో ఉదయం 49,786 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ 49,120 వద్ద కనిష్ఠాన్ని తాకి చివరకు 871 పాయింట్లు నష్టపోయి 49,180 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 14,712 వద్ద మొదలై రోజులో 14,535-14,752 మధ్య కదలాడి 265 పాయింట్లు కుంగి 14,549 వద్ద ముగిసింది.

దాదాపు అన్ని రంగాల సూచీలు అనగా స్థిరాస్తి, లోహ, ఆటో, బ్యాంకింగ్‌, పీఎస్‌యూ, ఆర్థిక, మౌలిక రంగాల్లోని షేర్లు రెండు శాతానికి పైగా నష్టపోయాయి. ఏషియన్‌ పెయింట్స్‌, సిప్లా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌,హిందాల్కో ఇండస్ట్రీస్‌, టాటా స్టీల్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.