క్రైమ్ (Crime) వార్తలు (News)

నగరంలో సంచరిస్తున్న చెడ్డి గ్యాంగ్ బీభత్సం??

ఆరు నెలలకోసారి చెడ్డీ గ్యాంగ్‌ నగర శివారు పరిధిలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాలు విసురుతూ ఉంటారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినా తప్పించుకునే నేర్పు వీరి సొంతం! ఇళ్ల తాళాలు పగలకొట్టి చాకచక్యంగా దొంగతనం చేయడంలో ఈ గ్యాంగ్‌ ను మించినవారు లేరు. ఒక ప్రాంతంలో అడుగుపెట్టారంటే కనీసం 3 దొంగతనాలు చేసి పారిపోతారు. పోలీసులు బృందాలుగా వీడిపోయి గస్తీ నిర్వహిస్తున్నా ఉహించని రీతిలో దొంగతనాలు చేసి మాయమైపోతుంటారు. ఈ గ్యాంగ్‌ దొంగతనం చేసినట్లు సీసీ ఫుటేజీ పరిశీలిస్తేగానీ తెలియదు. కాలనీలవాసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతుండగా పోలీసులు సైతం పెట్రోలింగ్, గస్తీ బృందాలు పెంచాలని కాలనీల వాసులు కోరుతున్నారు. కేపీహెచ్‌బీ పరిధిలో సుమారు రెండేళ్ల కిందట, అంతకుముందు ఏడాది సంక్రాంతి సమయంలో ఈ గ్యాంగ్‌ హల్‌చల్‌ చేసింది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుంటుంది.

ఉదయం ఆ గ్యాంగ్‌ మహిళలు దుప్పట్లు, బొమ్మలు విక్రయిస్తున్నట్లు కాలనీల్లో సంచరిస్తున్న క్రమంలో ఇళ్ల బాల్కనీలు, ఆరుబయట ఆరేసిన దుస్తుల ఆధారంగా ఖరీదైన ఇళ్లుగా గుర్తించి రాత్రి దొంగతనానికి వచ్చే పురుషులకు చూపిస్తారు. వీరు నలుగురు నుంచి అయిదుగురు వరకు ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి దాటాకే కాలనీల్లోకి ప్రవేశించి దొరికినా చిక్కకుండా ఒంటికి నూనె పూసుకుని బనియన్, చెడ్డీ వేసుకుని అడుగుల శబ్దం వినిపించకుండా చెప్పులు చేత పట్టుకోవడం లేదా నడుముకు కట్టుకుంటారు. ఇనుపరాడ్‌తో శబ్దం రాకుండా ఎలాంటి తాళాలైనా పగలకొడతారు. వెండి, ఆభరణాలు కాజేస్తారు. కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలో గతంలో ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, భగత్‌సింగ్‌నగర్‌ ఫేజ్‌-2 కాలనీల్లో తాళాలు పగలకొట్టి ఇళ్లల్లోకి చొరబడ్డారు. బహుళ అంతస్తుల భవనాలకంటే వ్యక్తిగత ఇళ్లనే ఎంచుకుంటారు.

ఏ జాగ్రత్తలు పాటించాలి??

ఇంటి చూట్టూ, ప్రాంగణంలో పొదలు లేకుండా చూసుకోవాలి. కాలనీలోకి కొత్త వ్యక్తులు వస్తే కుక్కలు మొరుగుతాయి. వెంటనే అప్రమత్తమవ్వాలి. వీలుంటే కాలనీల సంక్షేమ సంఘాలు చొరవ చూపి గస్తీ నిర్వహించాలి. ఇంటి గేటు, ప్రహరీ దాటి ప్రాంగణంలోకి ప్రవేశించగానే అలారం మోగేలా ఏర్పాటు చేసుకోవాలి. మధ్యాహ్నం ఇళ్లను ఏవరైనా అదేపనిగా చూస్తూ సంచిరిస్తున్నట్లు అనుమానం వస్తే ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫోన్‌ చేయాలి. ఊరెళ్లినా, ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారమివ్వాలి. రాత్రి సమయంలో ఏ అనుమానం వచ్చినా చుట్టుపక్కల వారిని కూడా అప్రమత్తం చేయాలి. విలువైన వస్తువులు ఇళ్లల్లో కాకుండా బ్యాంకులో భద్రపరుచుకోవాలి. సీసీ కెమెరాలు బిగించుకుని వాటి పనితీరును పరిశీలిస్తుండాలి.

పోలీసులకు సహకరించాలి. నేరాల నియంత్రణకు కాలనీలవాసుల భాగస్వామ్యం చాలా అవసరం. చెడ్డీ గ్యాంగ్‌ నగరంలోకి ప్రవేశించినట్లు సమాచారం ఉంది. మధ్యాహ్న సమయంలో ఇళ్ల చూట్టూ ఎవరైనా అనుమానాస్పదంగా సంచిరిస్తున్నట్లు అనిపిస్తే 040-27853952 లేదా 100కి ఫోన్‌ చేయాలి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •