అంతర్జాతీయం (International) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

టోక్యో ఒలింపిక్స్ హాకీపోరులో 3-2తో జట్టు ఘన విజయం!!

ఒలింపిక్స్‌లో టీమ్‌ఇండియా పురుషుల హాకీలో న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో 3-2 తేడాతో ప్రత్యర్థిని ఓడించి ఘన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (26ని, 33ని) రెండు గోల్స్‌తో దుమ్మురేపగా మాజీ సారథి, గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ ప్రత్యర్థి పాయింట్లను అడ్డుకుని గోల్‌పోస్ట్‌ వద్ద నిలబడ్డాడు. రూపిందర్‌పాల్‌ సింగ్‌ (10 ని) మొదటి గోల్‌ చేశాడు. మ్యాచ్‌ మొదలైన ఆరో నిమిషంలోనే న్యూజిలాండ్‌ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లగా పెనాల్టీ కార్నర్‌ను కేన్‌ రసెల్‌ సద్వినియోగం చేసుకోగా పదో నిమిషంలో రూపిందర్‌ గోల్‌ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. స్ట్రైకర్‌ మన్‌దీప్‌ సింగ్‌ స్కోరు చేయనప్పటికీ మైదానంలో చురుగ్గా కదిలాడు. జట్టుకు గోల్‌ అవకాశాలు మెరుగుపరచాడు.

రెండో క్వార్టర్‌లో గుర్జంత్‌ భారత్‌కు ఆధిక్యం అందించేందుకు ప్రయత్నించగా కివీస్‌ గోల్‌కీపర్‌ లియాన్‌ హేవర్డ్‌ దానిని అడ్డుకున్నారు. అయితే 26వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ గోల్‌ కొట్టి టీమ్‌ఇండియాను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లగా కోర్టు మారగానే మళ్లీ అతడే 33వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలవడంతో భారత్‌ 3-1తో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించగా మరో 10 నిమిషాల వ్యవధిలోనే స్టీఫెన్‌ జోసెఫ్‌ గోల్‌ కొట్టి స్కోరును 2-3కు తగ్గించాడు.

ఆఖరి నిమిషాల్లో న్యూజిలాండ్‌ దూకుడుగా ఆడి వరుసగా పెనాల్టీ కార్నర్లు సాధించింది. ఐతే గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. మరో 24 సెకన్లలో ఆట ముగుస్తుందనగా కివీస్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను అతడే విజయవంతంగా అడ్డుకొని భారత్‌కు పూర్తి పాయింట్లు వచ్చేలా చేశాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •