తమ డిమాండ్లను సాధించుకోవాలని పంతంతో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి క్యాబ్‌డ్రైవర్లు ఓలా, ఉబర్‌ సర్వీసులను నిలిపివేసారు. దీంతో నిత్యం విమానాశ్రయానికి రాకపోకలు సాగించే దాదాపు మూడు వేల ఓలా, ఉబర్‌ క్యాబ్‌లు నిలిచిపోయాయి. దీంతో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే క్యాబ్‌డ్రైవర్లు నిరసనల బాట పట్టారు.

కరోనా వ్యాప్తికి ముందు విమానాశ్రయం నుంచి సాధారణంగా రోజుకు 5 వేలకు పైగా క్యాబ్‌లు సేవలు అందించేవి. కొవిడ్‌ తర్వాత వాటి సంఖ్య మూడు వేలకు తగ్గింది. విమాన రాకపోకలు సరిగా లేక ప్రయాణికులు తగ్గిపోవడంతో పాటు డీజిల్‌ రేట్లు పెరగడంతో క్యాబ్‌లు నడపడం డ్రైవర్లకు కష్టంగా మారింది. దీంతో దిక్కుతోచని స్థితిలో క్యాబ్‌ డ్రైవర్లు కిలోమీటర్‌కు చార్జీని రూ.22లకు పెంచాలని, ఓలా, ఉబర్‌ సంస్థలు తీసుకునే కమీషన్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనకు దిగారు.

కరోనాకు ముందు ఒక క్యాబ్‌ డ్రైవర్‌ రోజుకు రూ.2వేల నుంచి రూ.3వేలు సంపాదించేవారు. కానీ నేడు కనీసం రూ.వెయ్యి కూడా రావడంలేదని పైగా ఓలా, ఉబర్‌ సంస్థలు 30% కమీషన్‌ తీసుకుంటుండడంతో వచ్చిన ఆదాయం అంతా ఆ సంస్ధలకు వెళ్లిపోతోందని వాపోతున్నారు. మరోవైపు క్యాబ్‌ సర్వీసులు నిలిచిపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. మూడు నూతన క్యాబ్‌ సర్వీసు (చాయిస్‌, క్విక్‌రైడ్‌, 4వీల్స్‌)లను అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీసీ పుష్పక్‌, బస్సులు కూడా అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. కి.మీ.కు చార్జి రూ.22లు ఇచ్చేవరకు తగ్గేదిలేదు. విమానాశ్రయంలో రూ.250ల పార్కింగ్‌ చార్జీలతో పాటు డీజిల్‌ రేట్లు పెరగడంతో రోజుకు కనీసం రూ.500 కూడా మిగలడం లేదు. ఇప్పటికైనా మమ్మల్ని ఆదుకోవాలి అంటూ క్యాబ్ డ్రైవర్ లు డిమాండ్ చేస్తున్నారు.