నీటి బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకతపై జలమండలి దృష్టిసారించి.. ఇంటింటికి, అపార్ట్‌మెంట్‌కు, పరిశ్రమల వద్దకు వెళ్లి బిల్లులు జారీ చేసే విధానానికి ఇకపై స్వస్తి పలకనుంది.

బిల్లుల జారీ మొదలుకొని వసూలు వరకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ విధానంలో చేయనున్నారు. జలమండలి డివిజన్‌ కార్యాలయాల వద్ద నగదు చెల్లింపులు, చెక్కులు తీసుకోవడం తదితర విధానాలు మున్ముందు అందుబాటులో ఉండవు. తొలుత వాణిజ్య నల్లాలకు జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి వస్తుంది ఆ తరువాత ఏప్రిల్‌ 1 నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానం చేపట్టనున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్‌ తెలిపారు.

ఖైరతాబాద్‌ జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలతో రెవెన్యూ అంశాలపై సమీక్షించిన అనంతరమే ఈ నిర్ణయానికి వచ్చారు. ఆన్‌లైన్‌ విధానంలో బోర్డు ఆదాయం పెరగడంతోపాటు మోసాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. గ్రేటర్‌ వ్యాప్తంగా 12 లక్షల నల్లాలు ఉండగా దానిలో 70 శాతం నల్లాలు గృహాలకు సంబంధించినవి. వీటి నుంచి రూ.36 కోట్లు వరకు ఆదాయం వస్తోంది. వాణిజ్య నల్లాల నుంచి రూ.70-80 కోట్లు ఆదాయం సమకూరుతోంది. అందుకే ప్రతి వాణిజ్య నల్లాకు మీటర్‌ ఉండేలా చర్యలు తీసుకుంటే ఆదాయం పెరిగే అవకాశం ఉందని దానకిషోర్‌ అన్నారు.