పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుడైన వ్యాపారవేత్త నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు నుండి తీర్పు వెలువడింది. ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలకు సంబంధించి ఆధారాలు పకడ్బందీగా ఉన్నందుకు లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.
నీరవ్ మోదీని ముంబయి ఆర్థర్ రోడ్ జైలులోని 12వ బ్యారక్‌లో ఉంచొచ్చని కూడా కోర్టు సూచించింది. 2020 ఆగస్టులో భారత్ పంపించిన ఆ జైలు వీడియో చూసి అక్కడ అన్ని సదుపాయాలు సంతృప్తికరంగా ఉన్నాయని నిర్ధారించుకున్నానని న్యాయమూర్తి జస్టిస్ శామ్యూల్ గూజీ అన్నారు.
భారత్‌లో నీరవ్ మోదీకి ఎలాంటి అన్యాయం జరగదని, తన మానసిక పరిస్థితి సరిగా లేదని నీరవ్ మోదీ చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చడమే కాకుండా ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది. అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునేందుకు నీరవ్‌కు కోర్టు అవకాశం మాత్రం కల్పించింది.
ఈ కోర్టు ఆదేశాలపై బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ సంతకం చేస్తే నీరవ్ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు సులువవుతుంది.