మహారాష్ట్రను కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తుంది. వషిమ్‌ జిల్లాలోని ఓ పాఠశాల వసతి గృహంలో 190 మందికి వైరస్‌ సోకడం మహారాష్ట్రలో కలకలం సృష్టించింది. వైరస్‌ సోకిన వారిలో 186 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు ఉండటం ఆలోచించవలసిన విషయం. దీంతో అధికారులు పాఠశాల పరిసరాల్ని కంటైన్‌మెంట్‌‌ జోన్‌గా ప్రకటించారు. ఇక వసతి గృహానికి వచ్చిన విద్యార్థుల్లో ఇటీవల మహారాష్ట్రలో ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందిన అమరావతి, యావత్మల్‌ జిల్లాలకు చెందిన వారే అధికంగా ఉండడం గమనార్హం.

గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో కొత్తగా 8వేలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదవ్వడం ఆందోళనకరంగా మారింది. కరోనా కారణంగా నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది మరణించారు. దేశంలో నమోదైన కేసుల్లో సగ భాగం మహారాష్ట్రలోనే నమోదవడం ఆందోళన చెందవలసిన విషయం. మహారాష్ట్రలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 60వేలుగా ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలు నివారణ చర్యలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, ముంబయి పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.