గురువారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల బాటలో నడిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల పరిణామాలకు తోడు మెటల్‌, ఎనర్జీ షేర్ల సహాయంతో సూచీలు లాభాలను గడించాయి. దీంతో సెన్సెక్స్‌ మరోసారి 51వేల మార్కును దాటగా.. నిఫ్టీ 15,100కు కొద్ది దూరంలోనే ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 72.42గా ఉంది.

ఉదయం 51,211 వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌ రోజు మొత్తం అదే తీరు అదే జోరు అన్నట్టుగా కొనసాగింది. ఒక దశలో 500 పాయింట్లకు పైగా లాభాల్లోకి వెళ్లిన సూచీ చివరికి 257.62 పాయింట్ల లాభంతో 51,039.31 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 115.35 పాయింట్ల లాభంతో 15,097.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో కోల్‌ ఇండియా, యూపీఎల్‌, అదానీ పోర్ట్స్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, భారత్‌ పెట్రోలియం షేర్స్ ఉన్నవారు ప్రధానంగా లాభపడ్డారు. ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, టైటాన్‌ కంపెనీ, దివీస్‌ ల్యాబ్స్‌ షేర్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఎఫ్‌ఎంసీజీ మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు కూడా లాభాల్లోనే ముగిశాయి.