దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని చిత్తూర్ జిల్లాలో మదనపల్లి జంట హత్యల కేసులో నమ్మలేని విషయాలు బయటపడుతున్నాయి.ఇప్పటి వరకు తండ్రి పురుషోత్తం నాయుడు , తల్లి పద్మజ లు కలిసి వారి కుమార్తెలు సాయి దివ్య, అలేఖ్యలను అత్యంత పాశవికంగా చంపినట్టుగా భావిస్తున్నారు. ఇప్పుడు చిన్న కుమార్తె సాయి దివ్యను పద్మజ చంపలేదని, పెద్ద కుమార్తె అలేఖ్యనే చిన్న కుమార్తెను చంపిందని డాక్టర్ల విచారణలో వెల్లడయింది.ఆ తర్వాత తనని చంపితే తాను వెళ్లి చెల్లిని తీసుకు వస్తానని చెప్పడంతోనే అలేఖ్యను పద్మజ చంపిందని వెల్లడయింది.

ప్రస్తుతం విశాఖపట్నంలో మానసిక ఆసుపత్రిలో సైకియాట్రిస్ట్ నిపుణుల అబ్సర్వేషన్ లో పురుషోత్తం నాయుడు,పద్మజ దంపతులు ఉంటున్నారు. ప్రతిరోజూ నిపుణులు వీరితో మాట్లాడి వీరి మానసిక స్థితిని అంచనా వేస్తున్నారు. వారిని మాటలలో పెట్టి ఆరోజు ఏమి జరిగిందని వివరాలను రాబడుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ చెప్పిన ప్రకారం ఆరోజు తన సోదరి సాయి దివ్యను అలేఖ్యయే చంపిందని అంగీకరించారని తెలుస్తుంది.వీరు ఇద్దరితో ఒకేసారి మాట్లాడకుండా వేరు వేరుగా మాట్లాడుతున్నాము అని చెప్పారు. ఈ ఘటన తర్వాత వారు పూర్తిగా షాక్ లో ఉండిపోయారు.పురుషోత్తంనాయుడు ఇంకా ఆ పరిస్థితి నుండి బయటపడలేదు. పద్మజ మాత్రం నెమ్మదిగా కోలుకుంటున్నారని విశాఖ మానసిక ఆస్పత్రి వైద్యులు చెప్తున్నారు.

తాను పూర్వ జన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేది అని, కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని పురుషోత్తం వైద్యులకు చెప్పినట్టు సమాచారం. అలేఖ్య చెప్పే విషయాలే తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లో కూడా ఉండడంతో ఆమె మాటలు నమ్మి ఈ విధంగా చేశామని చెప్పినట్టుగా తెలుస్తుంది.ఆధ్యాత్మిక పిచ్చి పట్టిన కూతురు, పద్మజాలే కిరాతకంగా వ్యవహరించారని పురుషోత్తం అన్నట్టుగా తెలుస్తుంది.