జమ్ముకశ్మీర్‌లో రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న విషయం పాఠకులకు విదితమే. మూడేళ్ల కిందట దీని నిర్మాణం ప్రారంభం అవ్వగా, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ప్రధాన ఆర్క్ దాదాపు పూర్తి అయ్యింది. దీనికి సంబంధించిన ఫొటోను ఫిబ్రవరి-25 – 2021 రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు.
ఇది ఒక అద్భుతమైన కట్టడంగా రూపొందుతుంది. మరో ఇంజినీరింగ్ మైలురాయిని అందుకునే దిశగా ఇండియన్ రైల్వేస్ అడుగులు వేస్తోందని పియూష్ గోయల్ హర్షం వ్యక్తం చేసారు. 476 మీటర్ల పొడువైన స్టీల్ ఆర్క్ను నిన్న విడుదల చేసిన ఫొటోలో చూడొచ్చు. కశ్మీర్‌ను మిగతా దేశంతో కలిపే రైల్వే ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నట్టుగా తెలిపారు.
2017 నవంబర్‌లో దీని నిర్మాణం ప్రారంభం కాగా దీనికి రూ.1250 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. చీనాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో దీని నిర్మాణం జరుగుతుంది. ఇది ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ ఎత్తు కంటే కూడా 35 మీటర్లు ఎక్కువ కావడం ఇక్కడ విశేషంగా చెప్పచ్చు. 8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకునే విధంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి మొత్తం పొడువు 1315 మీటర్లుగా ఉంటుంది.