పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకులో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు వెనుక వైపు ఉన్న కిటికీలను తొలగించి బ్యాంకులోకి ప్రవేశించి అలారం మోగకుండా ఉండేందుకు ముందుగానే బ్యాటరీ కనెక్షన్‌ తీసేశారు. అనంతరం వెంట తెచ్చుకున్న గ్యాస్‌ కట్టర్‌తో లాకర్‌ బద్దలు కొట్టి అందులోని రూ.18.46 లక్షల నగదుతో పాటు రూ.2.92 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లడమే కాకుండా చోరీ దృశ్యాలు సైతం బయటపడకుండా సీసీ ఫుటేజీ డీవీఆర్‌ బాక్స్‌ను సైతం వెంట తీసుకెళ్లారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్‌ పాలరాజు ఫిర్యాదుతో మంథని పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై రామగుండం సీపీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వేలిముద్రలు సైతం దొరకకుండా దొంగలు అన్ని జాగ్రత్తలు తీసుకొని దోపిడీకి పాల్పడ్డారని, ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని నిందితులకోసం మొత్తం 8 ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశామని.. త్వరలోనే వారిని పట్టుకుంటామనీ అన్నారు.