ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ తన నియంత వైఖరి మరోసారి బయటపెట్టుకున్నారు. ప్రపంచం అంతా కరోనా ఎలా నియంత్రించాలో తెలియని సమయంలో ముందస్తు హెచ్చరికలు చేయకుండానే జపాన్ తూర్పు ప్రాంత సముద్ర తీరంపైకి ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించింది. గురువారం తెల్లవారు జామున తమదేశ సముద్ర తీరంపైకి ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించినట్లు, ఇలా బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి అని జపాన్ ప్రధానమంత్రి యోషిహిడె సుగ ధృవీకరించారు.ఉత్తర అమెరికా భద్రత అధికారులు, దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నిర్ధారించారు. ఉత్తర కొరియా చర్యలపై జపాన్, దక్షిణ కొరియాల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రెండు దేశాలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి.

ఉత్తర కొరియాలోని దక్షిణ హమ్‌క్యుంగ్ ప్రావిన్స్ నుంచి జపాన్ సముద్ర తీరంపైకి బాలిస్టిక్స్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తర కొరియా ప్రయోగించిన రెండు క్షిపణుల్లో ఒకటి మీడియం రేంజ్, మరొకటి షార్ట్ రేంజ్ మిస్సైల్‌గా భావిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు, దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సంయుక్తంగా మరింత సమాచారాన్ని సేకరించే పనిలో పడినట్లు స్పష్టం చేసింది.

ఉత్తరకొరియా ప్రయోగించిన రెండింట్లో ఒక క్షిపణి అత్యాధునికమైన క్షిపణిగా అంచనా వేస్తున్నట్లు, ఈ రెండు క్షిపణులు ఎంత దూరం ప్రయాణించాయి?, ఏ లక్ష్యాన్ని అవి ఛేదించాయి? వాటి ప్రయాణ కాలం ఎంత? అనే విషయంపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామని అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ అధికార ప్రతినిధి కేప్టెన్ మైక్ కఫ్కా తెలిపారు. ఈ రెండు క్షిపణుల వల్ల కలిగిన నష్టం ఏ మేరకు ఉందనేది విశ్లేషిస్తున్నామని వివరించారు. ఈ ఉదంతంపై తాము దక్షిణ కొరియాతో కలిసి మరింత సమాచారాన్ని సేకరిస్తున్నామని చెప్పారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.