కరోనావైరస్‌ వ్యాప్తి పేరుతో బార్లు, థియేటర్లు మూసేయకుండా కేవలం విద్యాసంస్థలనే మూసేయాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజసం అని సికింద్రాబాద్‌లోని పీజీ విద్యార్ధులు, తెలంగాణకు చెందిన పలు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగారు. గురువారం మధ్యాహ్నం నుంచి హాస్టళ్లు మూసేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటి యాజమాన్యం బుధవారమే ఆదేశాలు జారీ చేయడంతో.. హాస్టల్‌ మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధి సంఘాలు, పీజీ కాలేజీలకు చెందిన అనేకమంది విద్యార్ధులు నిన్న సాయంత్రమే ఆర్ట్స్‌ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగి బార్లు, థియేటర్లకు లేని కరోనా భయం విద్యా సంస్థలకు ఎందుకని వారు ప్రశ్నించారు.

స్కూళ్ల మూసివేతతో తమకు అభ్యంతరం లేదని, యూనివర్సిటీ హాస్టళ్లను మూసేయాలని నిర్ణయించడం సరికాదని, వెంటనే పరీక్షలు నిర్వహించాలని, హాస్టళ్లను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వారు రోడ్డుపై ఆందోళన కొనసాగించారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నెల రోజులు స్కూళ్లు కాలేజీలు నడిపించారని, పేద విద్యార్ధుల పట్ల సీఎం కేసీఆర్‌ కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని విద్యార్ధి సంఘాల నాయకులు ఆరోపించారు. విద్యా సంస్థల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తక్షణం తెరవకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విద్యార్ధులు హెచ్చరించడంతో భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.