క్రైమ్ (Crime) వార్తలు (News)

రూ.300లకు గెజిటెడ్ సైన్ లభ్యమగును??

ప్రభుత్వ అధికారులు ఇటు ఫైల్ ని మూవ్ చేయాలన్నా, మరే ఇతర అవసరాలకైనా లంచం తీసుకోకుండా పని చేయడమే లేదు. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా కొందరు అధికారులు పేదల నుంచి వందల రూపాయలు ఆశిస్తూ కక్కుర్తి పడుతున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు మాత్రమే కాదు వైద్యారోగ్య శాఖలో కూడా అవినీతి జరుగుతోంది. ఆఖరికి సంతకాన్ని కూడా డబ్బుకు అమ్ముకుంటున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు సోమవారం టీఎస్ లాసెట్ రాసేందుకు నగర శివారులోని కాలేజీకి వచ్చి అప్లికేషన్ ఫామ్‌లో తప్పనిసరిగా గెజిటెడ్ సంతకం కావాల్సిందేనని సెంటర్ నిర్వాహకులు తెలపడంతో హుటాహుటిన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. సమయం తక్కువగా ఉంది అర్జెంట్‌గా గెజిటెడ్ సంతకం కావాలని అక్కడున్న సిబ్బందికి తెలపడంతో సంతకం పెట్టాలంటే మా సర్‌కి రూ.300 ఇవ్వాలని తెలిపారు. చేసేదేమి లేక ఆ వ్యక్తికి డబ్బులిచ్చి(ఆన్‌లైన్ పేమెంట్) గెజిటెడ్ సంతకం పొందాడు.

రాష్ట్రంలో జరిగే ఎంట్రెన్స్ టెస్టులు, మిగతా పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలకు తప్పనిసరిగా గెజిటెడ్ సంతకం ఉండాలని నిబంధన ఉండడంతో దీనికోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు దగ్గరున్న ప్రభుత్వ పాఠశాలలు, రెవెన్యూ కార్యాలయాలు, ప్రభుత్వాసుపత్రులకు వెళ్తుంటారు. అలా వచ్చే వారికి కొంతమంది అధికారులు చివరికి గెజిటెడ్ సైన్‌ని కూడా అమ్ముకునే స్థితి నెలకొంది. అయితే దీంట్లో కూడా అర్జెంటు లేనివారికి రూ.100, అర్జెంటు అయిన వారికి పత్రాన్ని బట్టి రేటు నిర్ణయిస్తున్నారు. ఈ దందాను నేరుగా చేయకుండా సహాయకులకు, వైద్యులకు లోపాయకార ఒప్పందంతో జోరుగా కొనసాగుతోంది. తమ అవసరం కాబట్టి ఎంత అడిగినా ఇచ్చి తమ పని చేయించుకోవాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    15
    Shares
  • 15
  •  
  •  
  •  
  •