కొన్ని రోజుల క్రితం వర్షం సృష్టించిన భీభత్సంతో ఊటీ కొండ రైలు సేవలను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. అయితే రెండు నెలల అనంతరం మళ్ళీ ఊటీ కొండ రైలు సేవలు ప్రారంభం కావడంపై పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు.

కోయంబత్తూర్‌ జిల్లాలోని మేట్టుపాళయం నుంచి నీలగిరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న ఊటీకి గత వందేళ్లకు పైగా దక్షిణ రైల్వే శాఖ కొండ రైళ్లను నడుపుతోంది. పచ్చని చెట్లు, సెలయేళ్లు, వాగులు, వంకలు, గుహల మీదుగా సాగే ఈ రైలులో ప్రయాణం చేసేందుకు పర్యాటకులు పోటీపడుతుంటారు.

ఈ నేపథ్యంలో, కల్లారు-అడర్లీ రైల్వేస్టేషన్ల మధ్య ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా మట్టిచెరియలు, బండరాళ్లు దొర్లిపడడంతో రైలుమార్గం ధ్వంసమైంది. అందువల్ల గత అక్టోబరు 14 నుంచి డిసెంబరు 21వ తేదీ వరకు రెండు నెలలపాటు ఊటీ కొండ రైలు సేవలను నిలిపివేసిన అనంతరం మళ్ళీ ఇప్పుడు ఆ సేవలను పునరుద్ధరించారు.