తెలంగాణ కొత్త జోనల్‌ విధానంలో భాగంగా ప్రభుత్వం బదలాయించిన ఉద్యోగులు, అధికారులు వెంటనే కొత్త పోస్టింగుల్లో చేరాలని ఆయా శాఖలు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, శాఖాధిపతులు, ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. కేటాయింపుల ఆధారంగా వెంటనే బదలాయింపులు పూర్తిచేసి వారం రోజుల్లో విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలని నిర్దేశించింది. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి సొంత జిల్లాలకు కేటాయించిన ఉద్యోగులు కొత్త స్థానాల్లో రిపోర్టింగుకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. వాటన్నింటిని శుక్రవారం పరిశీలించి, శనివారం వరకు వారికి నిర్దేశించిన స్థానాలపై జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులిస్తారు.

ఆరోజు మొదలుకుని వారం రోజుల్లో వారు నిర్దేశించిన స్థానాలకు చేరుకోవాలి. మరోవైపు జోనల్‌, బహుళజోనల్‌ స్థానాలకు కేటాయింపులు పూర్తి కావస్తున్నాయి. వారికి శుక్రవారం నుంచి సంక్షిప్త సందేశాలను, దానికి లింక్‌తో ఉత్తర్వులను ప్రభుత్వం పంపించాలని నిర్ణయించింది. వారంతా మూడు రోజుల్లో తమ శాఖాధిపతులు, ముఖ్యకార్యదర్శుల వద్ద రిపోర్ట్‌ చేయాలి. మూడు రోజుల తర్వాత వారికి కొత్త పోస్టింగులు ఇచ్చి అందులో చేరేందుకు వారం రోజుల గడువునిస్తారు. కొన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తమకు జూన్‌ వరకు కొత్త పోస్టుల్లో చేరే అవకాశం ఇవ్వాలని సీఎస్‌ను కోరారు. ప్రస్తుతం ఉద్యోగులంతా విధుల్లో చేరితే వచ్చే జూన్‌ తర్వాత కౌన్సెలింగు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్‌ తెలిపారు.

రెవెన్యూ సహా కొన్ని శాఖల్లో నేరుగా నియమితులైన నాయబ్‌ తహసీల్దార్లు, ఇతర ఉద్యోగులను సీనియారిటీ జాబితాలో పదోన్నతులు పొందిన తర్వాత కేటాయిస్తున్నారనే ఫిర్యాదులపై సీఎస్‌ స్పందించారు. 30:70 నిష్పత్తిలో నేరుగా నియమితులైన వారు, ప్రమోటీలకు సీనియారిటీని కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాల్లో పోస్టింగులపై కలెక్టర్లు కసరత్తు మొదలు పెట్టేసారు.