కళ్ళ ముందే తండ్రిని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపడం చూసిన ముగ్గురు పసి పిల్లలు ‘మా నాన్నను చంపినవాళ్లు మమ్మల్నీ వదలరు సార్‌.. కాపాడండి’ అంటూ మెట్పల్లి డీఎస్పీ గౌస్‌ బాబా కాళ్ల మీద పడి మొక్కడం చూపరుల చేత కంటతడి పెట్టించింది.వీరి తండ్రి జగిత్యాల జిల్లా ఎర్దండి గ్రామానికి చెందిన బర్లపాటి రాజేశ్వర్‌. మొన్నటిదాకా గల్ఫ్‌లో ఉండి కొద్దికాలం క్రితమే ఊళ్లోకి అడుగుపెట్టిన అతణ్ని వ్యక్తిగత కక్షలతో ప్రత్యర్థులు బుధవారం రాత్రి కత్తితో పొడిచి హత్య చేశారు. ఆట బొమ్మలు కొనిస్తానన్న తండ్రి వేట కొడవలికి బలైపోవడంతో వారు తీవ్రంగా కలత చెందారు. ఆ హత్య కళ్లారా చూడడంతో అత్యంత భయభ్రాంతులకు గురి అయ్యారు. నిందితుడు పోశెట్టిని ఉరి తీయాలని, లేదంటే చిన్నారులను కూడా చంపేసే అవకాశం ఉందంటూ హతుడి బంధువులు, మహిళ సంఘాల సభ్యులు గురువారం పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తామని డీఎస్పీ హామీ ఇచ్చారు.