భారత్‌తో జరిగిన డే/నైట్ టెస్టులో ఇంగ్లాండ్ ఘోరపరాజయాన్ని పొందిన విషయం తెలిసిందే! మొతేరా వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓటమిపాలైంది. అయితే టీమిండియా ఘన విజయంపై బ్రిటిష్ వార్తా సంస్థలు తమ అక్కసు వెల్లగక్కాయి. తమ జట్టు ఓటమికి స్పిన్‌ పిచ్‌ కారణమే కానీ తమ ఆటగాళ్లు కాదని, ఇది అసలు టెస్టు క్రికెట్‌ కాదని, రెండు రోజుల్లోనే టెస్టు మ్యాచ్‌ ముగిసిందని, భారత్‌ క్రీడాస్ఫూర్తి హద్దులు దాటుతుందని, నిందిస్తూ రాసుకొచ్చాయి.

స్వదేశంలో జరిగే సిరీస్‌లో ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది కానీ ఈ పిచ్‌ అయిదు రోజులకు సరిపడేది కాదని వ్యాఖ్యానించాయి. 12-14 నెలల పాటు ఆ స్టేడియాన్ని నిషేధించాలని వ్యాఖ్యలు చేశాయి.
అయితే కొన్ని బ్రిటిష్ వార్తా సంస్థలు మాత్రం ఇంగ్లాండ్ జట్టు పేలవంగా ఆడడమే ఘోర ఓటమికి కారణమని నిజాయితీగా ఒప్పుకున్నాయి.ఇంగ్లాండ్‌ బోర్డు అవలంబిస్తున్న రొటేషన్‌ పద్ధతిని, జట్టులో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నారని తీవ్రంగా తప్పుబట్టాయి. తొలి ఇన్నింగ్స్‌లో 74/2తో మంచి స్థితిలో ఉన్నవాళ్ళు స్పిన్‌ను ఎదుర్కోలేక ‌ విఫలమయ్యారన్నారు. కేవలం ఒకే ఒక్క స్పిన్నర్‌, నలుగురు నంబర్‌.11 బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగారని విమర్శించాయి. రెండు రోజుల్లో చవిచూసిన ఘోర ఓటమికి సులువైన కారణాలు చెప్పడానికి వీలులేదని, దానికి లోతుగా విశ్లేషించాలని ఆరోపించాయి.