కరోనా వైరస్ బయటపడి ఇప్పటికి ఏడాది పూర్తయింది. అది చేసే విలయ తాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. టీకాలు ఇంకా అందరికి చేరువకాలేదు.ఇప్పటికి కూడా వైరస్ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. గురువారానికి 25 లక్షల పైచిలుకు మరణాలు సంభవించాయి.ఇప్పటికి 11,26,18,488 మంది దీనిబారిన పడగా, 25,00,172 మంది మృత్యువాత పడ్డారు.


ఈ వైరస్ కారణంగా ఐరోపా దేశాలు ఎక్కువ నష్టపోయాయి. 8,42,894 మరణాలతో ఐరోపా దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అమెరికా, దాని పొరుగునే ఉన్న కెనడాలో 5,28,039 మందిని వైరస్ బలితీసుకుంది. ఇక లాటిన్‌ అమెరికా, కరీబియన్ దేశాల్లో 6,67,972 మంది మృత్యువుకి బలయ్యారు.సగానికి పైగా మరణాలు కేవలం ఐదు దేశాల్లోనే వెలుగుచూశాయి. ఐదు లక్షల పైచిలుకు మరణాలతో ఆ జాబితాలో అమెరికా ముందుండగా బ్రెజిల్, మెక్సికో, భారత్‌, బ్రిటన్‌ దేశాలు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. వైరస్ ఉద్భవించిన చైనాలోనే జనవరి 2020లో మొదటి వైరస్ మరణం నమోదైంది. అదే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 10 లక్షలు అది కూడా తొమ్మిది నెలల్లోనే దాటేసింది. ఆ తరువాత నాలుగు నెలల్లో మరో పదిలక్షలమంది మృతి చెందారు.

ప్రపంచ దేశాలు ఎన్ని నియంత్రణ చర్యలు చేపెట్టినప్పటికీ మొత్తం మృత్యుఒడికి చేరిన వారి సంఖ్య 25 లక్షలు. జనాభా పరంగా చూస్తే బెల్జియంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి 10లక్షల మందికి సగటున 1,900 వైరస్ మరణాలు సంభవించాయి. తరువాత స్థానాలు చెక్‌రిపబ్లిక్ ‌(1,850), స్లోవేనియా (1,830), బ్రిటన్ ‌(1,790), ఇటలీ (1,600) లు ఉన్నాయి. కాగా ఇప్పుడు భారత్ లో కరోనా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు వరుసగా రెండో రోజు కూడా 16 వేలకు పైగా నమోదు అయ్యాయి. 16,577 కొత్త కేసులు నమోదు కాగా 120 మరణాలు సంభవించాయి.