అమెరికాలో ఆరిజోనాకు చెందిన దంపతులు ఇటీవల సెకండ్‌హ్యాండ్ వస్తువులు విక్రయించే ఓ దుకాణంలో తమ చిన్నారి కోసం ఒక బొమ్మను కొనుగోలు చేశారు. ఎంతో చూడ చక్కగా ఉన్న ఆ బొమ్మలో లైట్లు వెలుగుతాయి, నొక్కితే వీనుల విందుగా చక్కటి సంగీతం వినిపిస్తుంది. ఆ బొమ్మని శుభ్రం చేద్దామని దానికున్న జిప్ తెరచిచూస్తే అందులో నుండి డ్రగ్స్ బయటపడ్డాయి. దాదాపు 5 వేలకుపైగా ఫెంటానిల్ డ్రగ్స్ బిళ్లలు ఉన్నాయి. తమ చిన్నారికి బొమ్మ కొనిచ్చి సంతోషపెడదామని భావించిన తల్లిదండ్రులు ఆ బొమ్మలో డ్రగ్స్ దొరకడంతో ఈ బొమ్మ యజమానే వీటిని పెట్టి ఉంటాడని ఆ దంపతులు భావించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫీనిక్స్ పోలీసులు సమాచారం అందుకొని ఇంటికి వచ్చి బొమ్మను, బొమ్మలో లభించిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఫీనిక్స్ పోలీసులు సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ సెకండ్‌హ్యాండ్ బొమ్మలు కొనుగోలు చేసినప్పుడు వాటిని బాగా పరిశీలించిన తరువాత మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు సూచించారు.