పెదఉల్లగల్లు గ్రామానికి చెందిన గురులింగం కుమారుడు శ్రీనివాసులు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వాసి శైలజ నాలుగేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం శైలజ మళ్ళీ మూడు నెలల గర్భిణి. కొంతకాలంగా భర్త భార్యపై అనుమానం పెంచుకుని శారీరకంగా హింసించినా భరించి కుటుంబ అవసరాలు చూసేది. కానీ గర్భిణి అనే కనికరం లేకుండా భార్యను కాళ్లతో తొక్కి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఆదివారంనాడు ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు, గురులింగం కలిసి ముండ్లమూరు తహసీల్దార్‌ దగ్గర లొంగిపోయారు. వేరేవ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానం కారణంగా ఈ నెల 20న అర్ధరాత్రి నిద్రపోతున్న శైలజ మెడపై కాలితో మరణించేవరకు నొక్కి చంపినట్టుగా శ్రీనివాసులు అంగీకరించాడు. ఇందుకు తన తండ్రి గురులింగం సహకరించాడని తెలిపాడు. ఆత్మహత్యగా నమ్మించడానికి శైలజకు పశువులపాకలో చీరతో ఉరివేశామన్నాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతం ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో చోటుచేసుకుంది. ఈ వివరాలను డీఎస్పీ కె.ప్రకాశరావు దర్శిలో గురువారం వెల్లడించారు.