ట్రాఫిక్ నుంచి గ్రేటర్‌ వాసులకు విముక్తి కల్పించేందుకు మొదలైన మెట్రో రైలు వేళలు పొడిగించకపోవడం నగరవాసులను తీవ్ర నిరాశకు గురిచేస్తుంది.. ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఎంజీబీఎస్, నాగోల్‌–రాయదుర్గం మూడు రూట్లలో ఉదయం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే మెట్రో సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. చివరి రైలు గమ్యస్థానాలకు రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుంది.

కానీ హైద్రాబాద్లో అదే సమయానికి వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ముగించుకొని రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకుంటారు. ఈనేపథ్యంలో మెట్రో రైలు సర్వీసులను అర్ధరాత్రి 12 గంటల వరకు నడపాలన్న డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్‌ నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న నేపథ్యంలో రైళ్ల వేళలు పొడిగించడం అనివార్యమని ప్రజారవాణా రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు.