దేశాన్ని కోవిడ్ కలవరపాటుకి గురి చేస్తుంది. కొద్ది రోజులుగా 100కి పైగానే మరణాలు సంభవిస్తున్న విషయం పాఠకులకు విదితమే! వరసగా రెండో రోజు 16 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 8,31,807 కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో 16,577 కొత్త కేసులు బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు వెల్లడించింది. తాజాగా 120 మంది ఈ వైరస్ కి బలయ్యారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య నేటికి 1,56,825కి చేరింది.

ఇక కొవిడ్‌ కేసుల విజృంభణ వల్ల క్రియాశీల రేటులో పెరుగుదల, రికవరీ రేటులో తగ్గుదల కనిపించడం ఆందోళనకరం. నిన్న 12,179 మంది కరోనా నుంచి కోలుకున్నాక ఇప్పటివరకు వైరస్ నుంచి బయటపడినవారి సంఖ్య 1.07కోట్లకు పైబడింది. 1,55,986 క్రియాశీల కేసులుండగా.. ఆ రేటు 1.41 శాతానికి చేరింది.

మరోవైపు, కరోనా వైరస్ టీకా కార్యక్రమం కూడా నిరాటంకంగానే కొనసాగుతోంది. ఫిబ్రవరి 25 నాటికి 1,34,72,643 మందికి కేంద్రం టీకా పంపిణీ చేసింది. నిన్న ఒక్కరోజే 8,01,480 మంది టీకా వేయించుకున్నారని అధికారవర్గాల సమాచారం.