టీం ఇండియాకి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే అవకాశాలు
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్ఇండియా మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంది. ఇప్పటికే 70% విజయాలతో ఫైనల్ చేరుకున్న న్యూజిలాండ్‌ను కూడా టీం ఇండియా అధిగమించింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో నంబర్‌వన్‌గా అవతరించింది. తాజా అపజయంతో ఇంగ్లాండ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అర్హత రేసులోంచి తప్పుకుంది.
మొతేరా వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి పాఠకులకు విదితమే! 49 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన సునాయాసంగా ఛేదించింది. యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ 11, అశ్విన్ 7 వికెట్లతో ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టగా ఈ ఓటమితో ఇంగ్లాండ్ జట్టు సిరీసులో 1-2తో వెనకబడింది. ఫలితంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది.
ప్రస్తుతానికి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే అవకాశాలు ఉన్న జట్లు రెండే ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టును గెలిచినా డ్రా చేసుకున్నా కూడా భారత్ 2-1 లేదా 3-1తో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే 2-2 సిరీస్ సమానం అయిపోయి ఆస్ట్రేలియాను అదృష్టం వరిస్తుంది. అప్పుడు ఆసీస్‌తో కివీస్ పోరాడాల్సి వస్తుంది. కానీ ఇలా జరిగే అవకాశాలు చాలా తక్కువ. కోహ్లీసేన నాలుగో టెస్టును డ్రా చేసుకోగలదు!