క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా టీం ఇండియా జెర్సీ ధరించిన క్షణాలు ఇప్పటికి గుర్తున్నాయని, 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లు గెలవడం, సచిన్‌ తెందుల్కర్‌ను భుజాలపై మోయడం తన కెరీర్‌లోని గొప్ప క్షణాలని, అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, బరోడా క్రికెట్‌ అసోషియేషన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

‘‘ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. అలా అని ప్రపంచకప్‌, ఐపీఎల్‌ ఫైనల్‌ నేడు జరగట్లేదు కానీ ఎంతో ముఖ్యమైన రోజని, ఈ రోజుతో క్రికెట్‌ ఇన్నింగ్స్‌కు నేను ముగింపు పలుకుతున్నాను, అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు ప్రకటిస్తున్నానని అన్నారు. అండగా నిలుస్తూ ప్రేమను పంచిన నా దేశానికి, కుటుంబానికి, స్నేహితులు, అభిమానులు, కోచ్‌లకు కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇలానే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా’’ అని యూసుఫ్‌ పేర్కొన్నారు.

‘‘నా క్రికెట్‌ కెరీర్‌లో ధోనీ సారథ్యంలో టీమిండియాకు, షేన్‌ వార్న్‌ కెప్టెన్సీలో ఐపీఎల్‌, జాకోబ్‌ మార్టిన్‌ నాయకత్వంలో రంజీ ట్రోఫీలో తొలిసారిగా ప్రాతినిధ్యం వహించాను.అంతర్జాతీయ, దేశవాళీ‌, ఐపీఎల్ క్రికెట్లు చాలా‌ ఆడాను. గౌతం గంభీర్‌ నాయకత్వంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టును కూడా రెండు సార్లు విజయంవైపు నడిపించాము, నాపై నమ్మకం ఉంచి అవకాశాలు ఇచ్చిన వాళ్లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.నా కెరీర్‌లో ఎదురైన అన్ని పరిస్థితుల్లోనూ అండగా నిలిచిన నా సోదరుడు ఇర్ఫాన్‌ పఠాన్‌కు కృతజ్ఞతలు’’ అని పఠాన్‌ అన్నారు.

38 ఏళ్ల యూసుఫ్‌ టీమిండియా తరఫున 57 వన్డేలు, 22 టీ20లు ఆడారు. 2007, 2011 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు. ఐపీఎల్‌లో 174 మ్యాచ్‌లు ఆడిన అతడు ఎన్నో ఇన్నింగ్స్‌లు ఆడారు. 1046 పరుగులు, 46 వికెట్లు తీశారు. అంతేగాక రాజస్థాన్‌, కోల్‌కతా జట్లు ఛాంపియన్‌గా నిలవడంతో అతడు కీలక పాత్ర పోషించారు. 3204 పరుగులతో పాటు బంతితోనూ రాణించి 42 వికెట్లు తీశారు. అయితే గత చివరి రెండు ఐపీఎల్‌ సీజన్‌ వేలాల్లో ఏ జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు. దేశవాళీలో బరోడా తరఫున ఆయన ప్రాతినిధ్యం వహించారు. యూసుఫ్‌తో పాటు టీమిండియా ‌ ఆర్‌.వినయ్‌ కుమార్‌ కూడా శుక్రవారమే రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం.