ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా తొండంగిలో కరోనా కలకలం రేగింది. తొండంగిలో ఓ ఇంట్లో నిర్వహించిన భజన కార్యక్రమంలో మరో నాలుగు కుటుంబాలు పాల్గొన్న తర్వాత వీరిలో కొందరికి జ్వరం రావడంతో పరీక్షించగా 21 మందికి కరోనా నిర్థారణ అయింది.

రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల వరకు 35,196 నమూనాలను పరీక్షిస్తే 2.15శాతం మంది వైరస్‌ బారిన పడ్డారు. చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. చిత్తూరులో అత్యధికంగా 175 కేసులు రాగా.. గుంటూరులో 127మందికి పాజిటివ్‌గా తేలింది. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 13 కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్‌ కేసుల సంఖ్య రెండంకెలకు చేరింది.