మహారాష్ట్ర రాజధాని ముంబయిలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత స్థానిక డ్రీమ్స్‌ మాల్‌లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముంబయి మహా నగరంలోని భాండప్‌ ప్రాంతంలో ఓ మాల్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోగా ఇదే మాల్‌లో ఒక అంతస్తులో కరోనా ఆస్పత్రి కూడా ఉంది. చూస్తుండగానే మూడో అంతస్తులో ఉన్న సన్‌రైజ్‌ హాస్పిటల్‌ వరకు మంటలు వ్యాపించాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇరవైకి పైగా అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

అయితే తమ ఆస్పత్రిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సర్‌రైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఫైర్‌ అలారం మోగడంతో మేం అప్రమత్తమై 76 మంది రోగులకు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం. కరోనాతో చనిపోయిన ఇద్దరి మృతదేహాలను తీసుకొచ్చాం’’ అని తెలిపాయి. కాగా.. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఘటనాస్థలాన్ని ముంబయి కిషోరీ మేయర్‌ పరిశీలించారు. మాల్‌లో ఆస్పత్రిలో ఉండటం పట్ల మేయర్ ఆశ్చర్యం వ్యక్తం చేయాగా తాము నిబంధనల ప్రకారమే ఇక్కడ ఆస్పత్రి ఏర్పాటు చేశామని సన్‌రైజ్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా ఘటన రాజకీయంగా దుమారం రేపింది. మాల్‌లో ఆస్పత్రి నడిపేందుకు ఎలా అనుమతి ఇచ్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.