రెండు రోజుల నుండి నష్టాల్లో మునిగిన దేశీయ స్టాక్ మార్కెట్లునేడు మళ్ళీ కోలుకుని లాభాల బాటపట్టాయి. భారీ నష్టాలతో దిగొచ్చిన షేర్ల కొనుగోలుకు ఇదే తగిన సమయం అని మదుపరులు భావించడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు బాగా కలిసొచ్చాయి. ముఖ్యంగా ఆటో, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోలు మద్దతు లభించి సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకుని సెన్సెక్స్ మళ్లీ 49వేల మార్కు, నిఫ్టీ 14,500 మార్కును అందుకున్నాయి.
ఉదయం 48,989 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 700 పాయింట్లకు పైగా లాభపడి, చివరికి 568.38 పాయింట్ల లాభంతో 49,008.50 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 182.40 పాయింట్ల లాభంతో 14,507.30 వద్ద స్థిరపడింది. టాటా స్టీల్ షేర్లు దూసుకెళ్లి దాదాపు 6 శాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీలో టాటా స్టీల్‌తో పాటు బజాజ్ ఫిన్సర్వ్, ఏషియన్ పెయింట్స్ హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ లిమిటెడ్ షేర్లు స్వల్పంగా నష్టాలను చవిచూశాయి.