నేడు భారత్ బంద్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా, తెదేపా, కాంగ్రెస్‌, బీఎస్పీ, వామపక్షాలు బంద్‌కు మద్దతివ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవ్వడంతో జనసంచారం లేని ఆర్టీసీ బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించి బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది.

విశాఖలో ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు నినాదాలు చేశాయి. మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. గుంటూరు, కర్నూలు, అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ల వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు.బంద్ కు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.