తన పిల్లల కోసం తల్లి తండ్రులు ప్రేమతో రకరకాల బహుమతులు ఇవ్వడం మనకు తెలుసు. కానీ ఇక్కడ ఒక వ్యాపారి ఏకంగా రెండు నెలల కుమారుడి కోసం చంద్రుడిపై స్థలం కొన్నారు. ఇది ఎక్కడో జరగలేదు ఇండియాలోనే గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన విజయ్‌ భాయ్‌ కథిరియా అనే వ్యాపారి తన రెండు నెలల కుమారుడు నిత్య కోసం చంద్రుడిపై స్థలం కొనాలనుకున్నారు. ఇందుకోసం అనుమతులు పొందటానికి న్యూయార్క్‌లోని ఇంటర్‌నేషనల్‌ లూనార్‌ రిజిస్ట్రీకి మెయిల్‌ పెట్టారు. మార్చి 13వ తేదీన అనుమతులు వచ్చాయి. కొద్దిరోజుల తర్వాత సదరు కంపెనీనుంచి విజయ్‌ కుమారుడు నిత్య పేరిట ఓ ఎకరం స్థలం కొన్నట్లు సర్టిఫికేట్లు వచ్చాయి.చంద్రుడిపై స్థలం కొన్న మొదటి సూరత్‌ వ్యాపారిగా రికార్డు కెక్కారు. చంద్రుడిపై గల ‘సీ ఆఫ్‌ మస్కోవీ’ అనే ప్రాంతంలో స్థలం కేటాయించారు.

మామూలుగా చంద్రుడిపై స్థలం సంపాదించటం సాధ్యపడదు కానీ ద్రుడిపై స్థలం కొన్నట్లు ఓ సర్టిఫికేట్‌ను మాత్రమే మనకు దక్కుతుంది. చాలా మంది దీన్ని ఒక విలువైన బహుమతిగా భావిస్తుంటారు. గతంలో కూడా ఇలాగే రాజస్తాన్‌కు చెందిన ధర్మేంద్ర అనీజా అనే వ్యక్తి కూడా చంద్రుడిపై మూడు ఎకరాల స్థలం కొని భార్యకు బహుమతిగా ఇచ్చారు.