టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

విద్యార్థులను పాఠశాలలకు తీసుకొచ్చే బాధ్యత ఉపాధ్యాయులదే!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల పునఃప్రారంభంపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి విద్యార్థులందరినీ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు.

గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా తండాలు, గూడేల్లోని ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలని సూచించారు. తల్లిదండ్రులు, విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి సెప్టెంబర్‌లో విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలా చూడాలన్నారు. ఇందుకోసం గ్రామాల్లోని అంగన్వాడీ కార్యకర్తల సేవలను వినియోగించుకోవాలని ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

విద్యాసంస్థల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల వంటి కనీస వసతులు కల్పించి, కావాల్సిన మరమ్మతులను వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించి దీనికోసం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వసతి గృహాల వార్డెన్లకు రూ.20వేల చొప్పున విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆహార పదార్థాలు, కాస్మొటిక్స్ కొరత లేకుండా గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్-జీసీసీ ద్వారా సమకూర్చుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అత్యవసర సేవల కోసం 24 గంటల పాటు నడిచేలా హెల్త్ కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. శానిటైజేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన పాఠ్య పుస్తకాలన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •