కె.ఎఫ్.సీ చికెన్ అంటే మాంసప్రియులు లొట్టలేస్తారు. ప్రపంచవ్యాప్తంగా కె.ఎఫ్.సీ కి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఆ రుచిని ఆస్వాదిద్దామని వెళ్లిన ఒక యువతికి చేదు అనుభవం ఎదురయ్యింది. కె.ఎఫ్.సీ చికెన్ ఆర్డర్ చేసిన ఒక కస్టమర్ కు ఏకంగా కోడి తలకాయ కనిపించడంతో అవాక్కయ్యింది.

సౌత్ లండన్ లో నివసించే గాబ్రియేల్ అనే ఒక మహిళ, ట్వికెన్‌హామ్ అనే ప్రాంతానికి వెళ్లి కె.ఎఫ్.సీ చికెన్ ఆర్డర్ చేసి తిందామని ప్యాకెట్ ఓపెన్ చేసిన ఆమెకు, అందులో సగం ఉడికిన కోడి తల కనిపించడంతో కొంత అసహనానికి గురైంది. చికెన్ అందరూ తింటారు, కాని ఇలా సగం ఉడికిన తల ఎలా తింటారంటూ గాబ్రియేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోస్ట్ కాస్తా వైరల్ అవడంతో.. రంగంలోకి దిగిన ‘కె.ఎఫ్.సీ’ సంస్థ బ్రాండ్ ఇమేజ్ కు భంగం కలగకుండా నష్టనివారణ చర్యలు చేపట్టింది.

తాము ఫ్రెష్ చికెన్ తోనే తమ వంటకాలు తయారు చేస్తామనేందుకు ఇదొక నిదర్శనమని, అయితే ఇలా కోడి తల రావడం మాత్రం కొంత క్వాలిటీ తప్పిదమే అవుతుందని సంస్థ చెప్తుంది. వెంటనే గాబ్రియేల్ ను కలిసిన సంస్థ ప్రతినిధులు.. ఆమెను ఆమె కుటుంబ సభ్యులను లండన్ లోని తమ రెస్టారంట్ కు పిలిపించి వారికి ఉచితంగా ‘కె.ఎఫ్.సీ’ మీల్స్ అందించినట్లు ‘కె.ఎఫ్.సీ’ సంస్థ తెలిపింది. అంతే కాదు తమ స్పెషల్ రెసిపీలో ఉపయోగించే ముడిపదార్ధాలు ఎన్ని క్వాలిటీ చెక్ ధాటి వస్తాయో తెలుపుతూ గాబ్రియేల్ కు వివరించారు.