ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్లు వారి హక్కుగా సుప్రీమ్ కోర్ట్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిని అనుసరించే ఏపీ హై కోర్ట్ కొన్ని కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ల చెల్లింపులు, జీతాలు ఆలస్యం చేస్తే వాటికి సహేతుకమైన వడ్డీని కలిపి చెల్లించవలసిందిగా సూచించింది. మాజీ జిల్లా, సెషన్స్ జడ్జి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివరణాత్మక ఉత్తర్వులు ఇచ్చింది. 2020 మార్చి-ఏప్రిల్ మధ్య వాయిదా వేసిన జీతాన్ని, పెన్షన్‌ను సైతం సంవత్సరానికి 12 శాతం చొప్పున వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.
కరోనా కారణంగా ఏర్పడిన ఆర్ధిక సంఖ్సోభం దృష్ట్యా 2020 మార్చి నుండి ఏప్రిల్ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ లను కొంతకాలం వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఆ తర్వాత ఏప్రిల్‌లో, వైద్య, ఆరోగ్య, పారిశుధ్య కార్మికుల పూర్తి జీతాలను ప్రభుత్వం పునరుద్ధరించింది. అంతేకాక ఏప్రిల్ 26 న పెన్షనర్లకు పూర్తి జీతం ఇచ్చేసింది కానీ నిలిపివేసిన జీతాలకుగాను ఎలాంటి వడ్డి జమ చేయలేదు. ఈ తరుణంలో మాజీ జిల్లా, సెషన్స్ జడ్జి హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేశారు. దానిలో ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి జీతం, పెన్షన్ ప్రధానమైన హక్కు అని పేర్కొంది.అంతే కాకుండా ప్రతినెలా చివరి తేదీన జీతాలు చెల్లించాలని ప్రస్తావించారు. మాజీ జిల్లా, సెషన్ జడ్జి వేసిన పిల్ పై హైకోర్టు వివరణాత్మకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ 72 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ నెలా చివరి తేదీన వేతనం చెల్లించాలని హైకోర్టు ఆ ఉత్తర్వులలో వివరించింది. కానీ ఎవరైనా ఉద్యోగి ఏదయినా తప్పిదం చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ లేదా జ్యుడిషియల్ ప్రాసెస్‌లో ఉంటే, అలాంటి వారి పెన్షన్ నిలపవచ్చు కానీ జీతం పొందే వ్యక్తి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో ఉన్న జీవన హక్కు, ఆర్టికల్ 300ఎలోని ఆస్తి హక్కు కిందకు వస్తారని హైకోర్టు తెలిపింది. నిలిపివేసిన జీతం, పెన్షన్ 12 శాతం వడ్డీతో సహా చెల్లించాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించిన కారణంగా ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ ఆశ్రయించింది.

కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభంతో ప్రభుత్వం కుదేలయి అన్నిరకాలుగా నష్టాలూ చవి చూసిందని దాని వలెనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను వాయిదా వేయాలని నిర్ణయించామని, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమ వాదనలను వినిపించింది. అప్పటి పరిస్థితులను దృష్ట్యా ఆ చర్య తీసుకున్నాము కానీ వడ్డీ చెల్లించాలని చెప్పడం సరైనది కాదని పేర్కొంది. ఆలస్యం చెల్లింపుపై ఆరు శాతం వడ్డీని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టుగా తెలిసింది. ఫిబ్రవరి 8న, న్యాయమూర్తులు డి.వై.చంద్రచుడ్, ఎం.ఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఆంధ్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కొట్టివేస్తూ, ప్రభుత్వ ఉద్యోగికి జీతం,పెన్షన్ పొందడం హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. చట్టానికి విరుద్ధంగా పనిచేసినందుకు హైకోర్టు ప్రభుత్వంపై 12 శాతం వడ్డీని విధించిందని ఉద్యోగుల తరపు న్యాయవాది పేర్కొన్నారు అయినప్పటికీ వడ్డీని చెల్లించడం ప్రభుత్వం శిక్షగా తీసుకోరాదని సుప్రీంకోర్టు తెలిపింది. చివరికి జీతం,పెన్షన్‌ను ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.