తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి ప్రత్యేక మేజిస్ట్రేట్ న్యాయస్థానాలను రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 53 ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులు రద్దు కానున్నాయి. విశ్రాంత న్యాయమూర్తుల నేతృత్వంలో రెండేళ్లలోపు శిక్ష ఉండే కేసులు, చెక్ బౌన్స్ వివాదాలను పరిష్కరించేందుకు పదేళ్ల క్రితం ప్రత్యేక మేజిస్టేట్ కోర్టులు ఏర్పాటయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఇటీవల 15 శాశ్వత న్యాయస్థానాలు మంజూరు కావడం వల్ల ప్రత్యేక మేజిస్ట్రేట్ కోర్టులను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. కానీ ఇప్పటికే ఈ ప్రత్యేక కోర్టుల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల సేవలను ఇతర న్యాయస్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన వినియోగించుకోవాలని ఉత్తర్వులు జరీ చేసారు.