హైద్రాబాద్లో వాహనదారులు ఇక పై వాహనం నడుపుతూ చరవాణిలో మాట్లాడితే కోర్టుమెట్లు ఎక్కాల్సిందేనని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నేరం రుజువైతే జరిమానాతో పాటు నెల నుంచి మూడు నెలల వరకు జైలుశిక్ష పడే ప్రమాదం ఉందని, చరవాణిలో మాట్లాడుతూ వాహనం నడిపే వారిపై కేసులు నమోదు చేసి ఛార్జిషీటును కోర్టుకు సమర్పించాలని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు.

రాజధానిలో 60 లక్షల వాహనాలు రోజూ రోడ్ల మీద తిరుగుతున్నాయన్నది పోలీసుల అంచనా. ఏటా నగర రోడ్లపై 1300 మందికి పైగా వ్యక్తులు చనిపోతుంటే వేలాది మంది గాయాలపాల వడానికి మొదటి కారణం వాహనదారుల నిర్లక్ష్యమేనని పోలీసులు భావిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అధికంగా చనిపోతున్నట్లు గుర్తించారు. దీని తర్వాత రెండవ కారణం బాలబాలికల డ్రైవింగ్‌వల్ల, శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల్లోనూ ఎక్కువ మంది దుర్మరణం చెందుతున్నారని గణాంకాల్లో వెల్లడవుతుంది. ఇక వీటితో పాటు మూడవ ముఖ్య కారణం డ్రైవింగ్‌లో చరవాణిలో మాట్లాడడమూ ఇటీవల పెరిగిందని, గత ఏడాది కాలంలో ఈ కారణంతోనూ రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగాయని, గత ఆరేడు నెలల్లోనే సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌తో దాదాపు 20 మంది చనిపోవడానికి కారణమైనట్లు తేలింది. ప్రస్తుతం
రూ.వెయ్యి వరకు చలానాలు రాసి జరిమానా వసూలు చేసినా కూడా ఆశించిన స్థాయిలో మార్పు రావడం లేదు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ కేసులు అధికంగా నమోదయ్యాయి. అయినా కూడా ఉపయోగం కనిపించకపోవడంతో ఇకపై కేవలం జరిమానాతో వదిలేయకుండా వారిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి ఛార్జిషీటును కోర్టుకు సమర్పించాలని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసు ఉన్నతాధికారులు పోలీసులకు సూచించారు.