గ్రామ, వార్డు సచివాలయాలే లక్ష్యంగా మరింత ఆధునీకరించిన స్పందన నూతన పోర్టల్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. స్పందన వినతుల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని, కలెక్టర్ల పని తీరుకు ఈ కార్యక్రమాన్ని ప్రామాణికంగా భావిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు ఏమైనా పరిష్కారానికి అర్హమైనవిగా గుర్తించిన తర్వాత తప్పకుండా వాటిని పరిష్కరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. పౌరుడు వినతిపత్రం ఇచ్చాక అది పరిష్కారం అయ్యే తీరు నేరుగా అధికారులు, ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని, ఈ ట్రాకింగ్‌ మెకానిజం చాలా పటిష్టంగా ఉండాలనీ నొక్కి వక్కాణించారు. పౌరుల గ్రీవెన్స్‌లను పరిష్కరించకుండా పక్కన పడేసే పరిస్థితి ఉండకూడదని, అంచెలంచెలుగా అధికారులు, సీఎం కార్యాలయ అధికారులు కూడా గ్రీవెన్స్‌ల పరిష్కారంపై ఎప్పటికప్పుడు పరిశీలన, సమీక్ష చేయాలని ఆదేశించారు. నిర్ణీత సమయంలోగా పరిష్కారం అది నిలిచిపోవడానికి కారణాలు సమీక్షించాలని, అది ఏస్థాయిలో నిలిచిపోయిందన్నది తెలియాలని, సంబంధిత సిబ్బంది, అధికారికి అలర్ట్స్‌ వెళ్లాలని సూచించారు. ఒకవేళగ్రీవెన్స్‌ను తిరస్కరిస్తున్నప్పుడు ఎందుకు తిరస్కరిస్తున్నారో కచ్చితంగా కారణం చెప్పగలగాలనీ సూచించారు.