వ్యాక్సీన్ వృథా విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని స్వయంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశంలో పేర్కొన్నారు. కేంద్రం లెక్కల ప్రకారం తెలంగాణ: 17.6%, ఆంధ్రప్రదేశ్: 11.6% వాక్సిన్ వృధా చేస్తున్నాయి. భారత్‌లో ఇప్పటి వరకూ 23 లక్షల డోసులు వృథా అయినట్టు ఓ అంచనా.

వ్యాక్సీన్ వృథా వెనుకున్న కారణాల గురించి ఆంధప్రదేశ్‌లో వ్యాక్సీనేషన్ బాధ్యతల్లో ఉన్న ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ‘‘దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రారంభంలో వృథా అయిన మాట వాస్తవమే. కొందరికి వ్యాక్సీన్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే వేయడం, వైద్య సిబ్బందిలో కొందరు శిక్షణ పొందినప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు చేయడం, వ్యాక్సీన్ బాటిల్‌లో ఎన్ని డోసులు ఉన్నాయో, అంత మంది వచ్చేవరకూ ఎదురు చూసి అప్పుడే బాటిల్ తెరవాల్సి ఉన్నా కానీ ఒకరిద్దరు వచ్చినప్పుడు కూడా వ్యాక్సీన్ వేసేయడం, చాలా సందర్భాల్లో పెద్ద అధికారులు వచ్చినప్పుడు కూడా ఇలా జరిగింది. వాళ్లకు నర్సులు ఎదరు చెప్పలేరు కదా’’ అని ఆ అధికారి అన్నారు.

కరోనా వాక్సిన్ ను ఒక నిర్ణీత ఉష్ణోగ్రత దగ్గర భద్రపరచక పొతే అది పాడవుతుంది. కోవిషీల్డులో 10 డోసులు, కోవ్యాక్సీన్‌లో 20 డోసులు ఉంటాయి కావున వాటిని తెరిచిన నాలుగు గంటల్లోపు వాడేయాలి. అసలు వ్యాక్సీన్ వృథాకు పలు కారణాలు ఉన్నాయి. అవి వ్యాక్సీన్ డేట్ ఎక్స్‌పైర్ అవడం,వాతావరణంలో వేడి ఎక్కువ ఉండడం, చలి ఎక్కువై బాటిల్ గడ్డకట్టుకుపోవడం, బాటిల్ పగలడం, బాటిల్ కనిపించకపోవడం, బాటిల్ కనిపించకపోవడం, నీరు, లేదా ఇతర పదార్థలతో బాటిల్ కలవడం, తిరిగి పంపేప్పుడు మిస్ అవడం లేదా సరిగా ప్యాక్ చేయకపోవడం వల్ల పగలడం, ఇంజెక్షన్ సరిగా చేయకపోవడం, రవాణాలో సమస్యలు, డోసులు కావల్సిన సంఖ్యలో తీసుకోకపోవడం (అంటే పది డోసుల బాటిల్ నుంచి 9 డోసులు తీయడం లాగా) లాంటి కారణాలు ఉన్నాయి.

ఆ అధికారి ‘‘మేం ఒకటే చెప్పాం. ఆ బాటిల్ లో ఎన్ని డోసులు ఉంటాయో, అంత మంది వచ్చి కూర్చున్న తరువాత, రిజిస్ట్రేషన్ వంటి ఫార్మాలిటీస్ పూర్తయ్యాక, బీపీ వంటివి చూశాక, అప్పుడే బాటిల్ తెరవమన్నాం. ఒకవేళ సంఖ్య తగ్గితే, బాటిల్ తెరవకుండా మరునాడు రమ్మనమని, నిర్మొహమాటంగా చెప్పమన్నాం. కానీ చాలా చోట్ల ఇలా జరగడం లేదు. పది మంది స్థానంలో ఇద్దరు ముగ్గురు వచ్చినా వ్యాక్సీన్ వేస్తున్నారు’’ అని వివరించారు. కొన్ని చోట్ల ఒకే డోస్ డబుల్ యుటిలైజేషన్ జరిగినట్టు కూడా రాసినట్టు, చాలా చోట్ల వ్యాక్సీన్ సరఫరాకు ముందు కచ్చితమైన సంఖ్యను తెలుసుకునే ప్రయత్నం చేయలేనట్టు ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో తన వాదన వినిపించలేదు కానీ తెలంగాణ మాత్రం ఖండించి, కేంద్రం చెప్పిన లెక్కలు తప్పని చెబుతుంది. ‘వ్యాక్సీనేషన్ ప్రక్రియను పర్యవేక్షించడానికి కేంద్రం వాడుతున్న సాఫ్ట్‌వేర్‌లో లోపాలు ఉన్నాయి. బఫర్ స్టాక్, రాష్ట్రంలో ఉన్న సైనికుల కోసం ఇచ్చిన వ్యాక్సీన్ వివరాలు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లనే ఈ తప్పుడు అంకెలు ప్రచారంలోకి వచ్చాయని తెలంగాణ ప్రజారోగ్య డైరెక్టర్ ఒక ప్రకటనలో చెప్పారు. ఈ లోపాలు అన్ని సవరిస్తే రాష్ట్రంలో వ్యాక్సీన్ వేస్టేజీ 1.22% మాత్రమే ఉంటుందని వారు అంటున్నారు.

తెలంగాణ లెక్కల ప్రకారం కేంద్రం, రాష్ట్రానికి 9,52,550 డోసులు ఇచ్చింది. అందులో సైనికులకు 40,540 డోసులు ఉంచారు. వ్యాక్సీన్ కేంద్రాల్లో బఫర్ స్టాక్ గా 25,680 డోసులు పెట్టారు. మొత్తం తెలంగాణలో వాడిన వ్యాక్సీన్లు 8,86,330 డోసులు. అందులో ప్రజలకు వేసిన వ్యాక్సీన్లు 8,75,478 డోసులు. వృథా అయినవి 10852 (1.22 శాతం). ఇది తెలంగాణ ప్రభుత్వం లెక్క. ఇందులో ఆర్మీ వారికి రిజర్వు చేసినవి, బఫర్ స్టాక్ లో ఉన్నవి ఉపయోగపడతాయా, వృథా అయ్యాయా, వాడుతారా, వాడలేదా అన్న విషయంలో తెలంగాణ అధికారుల నుంచి స్పష్టత వస్తే అన్ని లెక్కలు తేలుతాయని అధికారి ఒకరు వివరించారు.