వార్తలు (News)

కృష్ణా నదిలో భూప్రకంపనలు.. భూకంప లేఖినిపై 3.7గా నమోదు!!

సోమవారం వేకువజామున ఐదు గంటల ప్రాంతంలో నల్లమలలోని కృష్ణా నదిలో స్వల్ప భూకంపం సంభవించింది. శ్రీశైలం జలాశయానికి పడమర వైపు 44 కి.మీ దూరంలో, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు తూర్పున 18 కి.మీ దూరంలో కృష్ణానదిలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు హైదరాబాద్‌లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) వెల్లడించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని, భూకంప లేఖినుల్లో దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు తెలిపారు. భూకంపంతో నల్లమలలోని అచ్చంపేట పట్టణం, కొల్లాపూర్‌, లింగాల, అమ్రాబాద్‌, పదర, ఉప్పునుంతల, బల్మూరు మండలాలతోపాటు శ్రీశైలం సమీప గ్రామాలు, గిరిజన గూడేల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొన్ని ఇళ్లల్లోని వంటపాత్రలు, గిన్నెలు, డబ్బాలు, బొమ్మలు కిందపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో 4 సెకన్లు, మరికొన్ని చోట్ల మూడు సెకన్లు ప్రభావం చూపిందని, ఒక్కసారిగా శబ్దం రావడంతో ఇళ్ల నుంచి బయటికి వచ్చామని స్థానికులు చెప్పారు.

శ్రీశైలం డ్యాం భూగర్భ గ్యాలరీతోపాటు ఈగలపెంటలో భూ ప్రకంపనలు గుర్తించే రెండు సెన్సార్లుండగా ప్రకంపనలను అవి వెంటనే గుర్తించి ఎన్‌జీఆర్‌ఐకి సంకేతాలు పంపాయి. అనంతరం ఎన్‌జీఆర్‌ఐ అధికారులు ప్రకంపనల తీవ్రతను శ్రీశైలం డ్యాం అధికారులకు పంపించారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లకపోవడంతో శ్రీశైలం ఆనకట్టకు పెద్ద ముప్పు తప్పినట్లయింది. ఆనకట్ట నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో భూకంపాలు ఎప్పుడూ రాలేదని, ఇదే మొదటిసారి అని శాస్త్రవేత్తలు చెబుతుండగా భూకంపానికి కారణాలపై అధ్యయనం చేస్తున్న అధికారులు ఆత్మకూర్‌ ఫాల్ట్‌ కారణమని అంచనా వేస్తున్నారు. అక్కడి భూమిలోని రాతిపొరల్లో ఏర్పడిన ఒత్తిడి భూకంపానికి దారితీసి ఉంటుందని శాస్త్రవేత్త శ్రీనగేశ్‌ అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •