సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ కోటాలో 21 పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో (డిసెంబర్ 27 సాయంత్రం 5 గంటల్లో) ముగియనుంది.

ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి పలు క్రీడల్లో రాణించినవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, విద్యార్హతలు, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం మరిన్ని వివరాలు చూడండి.

మొత్తం 21 ఖాళీలు ఉన్నాయి. లెవెల్ 5/4 పోస్టులు 3 ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. లెవెల్ 3/2 పోస్టులు 18 ఉన్నాయి. 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. లేదా మెట్రిక్యులేషన్ + కోర్స్ ఉన్నవారు యాక్ట్ అప్రెంటీస్‌షిప్ పాస్ కావాలి. లేదా మెట్రిక్యులేషన్ + ఐటీఐ పాస్ కావాలి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్‌ను అర్హతగా పరిగణించరు.

క్రీడల వారీగా కేటాయించిన పోస్టుల వివరాలు చూస్తే బాస్కెట్ బాల్- 2, బాక్సింగ్- 2, హాకీ-2, వాటర్ పోలో-1, అథ్లెటిక్స్-1, బ్యాడ్మింటన్-1, క్రికెట్-2, కబడ్డీ-2, వాలీబాల్-1, వెయిట్ లిఫ్టింగ్-1, రెజ్లింగ్-2 పోస్టులు ఉన్నాయి. ఈ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో రాణించినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

క్రీడార్హతల వివరాలు చూస్తే లెవెల్ 5/4 పోస్టులకు బాస్కెట్ బాల్, బాక్సింగ్, హాకీ, లెవెల్ 3/2 పోస్టులకు వాటర్ పోలో, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, క్రికెట్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ లాంటి క్రీడల్లో రాణించాలి. అభ్యర్థుల వయస్సు 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.250.

అభ్యర్థులు https://rrccr.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Click here to Apply Online పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత CLICK HERE TO REGISTER పైన క్లిక్ చేయాలి. అభ్యర్థులు తమ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత విద్యార్హతల వివరాలు, అడ్రస్ వివరాలు ఎంటర్ చేయాలి. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. వివరాలన్నీ సరిచూసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.