ముంబై రాష్ట్రంలో కరోనా మహమ్మారి ముఖ్యంగా నూతన వేరియంట్‌ ఒమిక్రాన్‌ హడలెత్తిస్తుండడంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలను విధించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మరోసారి నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనున్నారు. కర్ఫ్యూ నిర్ణయం శుక్రవారం రాత్రి నుంచే అమలు చేస్తున్నట్టు మంత్రి అనీల్‌ పరబ్‌ ప్రకటించారు. దీంతోపాటు పలు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. అయితే ఎన్ని రోజులపాటు ఈ నైట్‌ కర్ఫ్యూ అమలు చేస్తారనేది మాత్రం తెలియరాలేదు. ఇతర ఆంక్షలకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేయనుంది.

మహారాష్ట్రలో బహిరంగ ప్రదేశాలలో నైట్‌ కర్ఫ్యూ సమయంలో అయిదుగురికి కంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేదించారు. హాలులో పెళ్లికి హాజరయ్యేవారి సంఖ్య 100 మందికి మించకూడదు. బహిరంగ ప్రదేశాలలో జరిగే పెళ్లిళ్లకు 250 లేదా స్థలం సామర్థ్యం బట్టి 25 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంది. వివాహ వేడుకలు కాకుండా ఇతర వేడుకల కోసం హాల్‌లలో 50 శాతం, బహిరంగ స్థలాల్లో సామర్థ్యాన్ని బట్టి 25 శాతం మించకూడదు. హోటళ్లు, జిమ్‌లు, స్పా, సినిమా హాళ్లు, ఆడిటోరియాలు తదితర ప్రాంతాల్లో కూడా 50 శాతం మందికే అనుమతి ఇచ్చారు.