కొత్తగా వచ్చిన నాయకులు ముఖ్యమంత్రి అని కూడా గౌరవించకుండా నోటికి వచ్చినట్లుగా కేసీఆర్‌ను దూషిస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇవాళ విద్యుత్ ఉద్యోగుల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… టీబీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి పదవులు వచ్చాయంటే అది కేసీఆర్ దయ వల్లనే అని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ తేవడం వల్లనే బండి సంజయ్, ఉత్తమ్‌కు పదవులు వచ్చాయన్నారు.
తెలంగాణలో కరోనా కారణంగా అభివృద్ధి కొన్ని బ్రేకులు పడ్డాయని, ఇక మీదట మళ్లీ అభివృద్ధిలో దూసుకుపోతామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు కరెంటు కోతలు విపరీతంగా ఉండేవని, కరెంటు కోసం పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేసే వారని కేటీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటల పాటు పుష్కలంగా కరెంటు ఉందంటే అది కేసీఆర్ కృషి ఫలితమే అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఎన్నికల్లో హామీ ఇవ్వని పథకాలను సైతం ప్రారంభించి ప్రజలను ఆదుకున్నామని కేటీఆర్ అన్నారు. త్వరలోనే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగ భృతి కూడా ప్రారంభిస్తామని, రేపోమాపో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయం ప్రకటిస్తారని తెలిపారు.