తిరుమల తిరుపతి దేవస్థానంపై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు చేయిస్తున్న తప్పుడు ప్రచారాలతో విసిగిపోయానని, త్వరలోనే చంద్రబాబు అనుకూల పత్రికపై తిరుపతి కోర్టులో పరువు నష్టం దావా వేస్తానని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. తాను, సత్యపాల్ సబర్వాల్ అనేక అడ్వకేట్ కలిసి ఈ కేసు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రోత్భలంతోనే తిరుమలపై అసత్య ప్రచారం జరుగుతోందని స్వామి ఆరోపించారు.
టీటీడీ విషయంలో సుబ్రహ్మణ్య స్వామి ముందు నుంచీ చంద్రబాబు, టీడీపీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. మొదట టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డిని నియమించినప్పుడు ఆయన క్రిష్టియన్ అని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో సుబ్రహ్మణ్య స్వామి స్పందించి సుబ్బారెడ్డి పక్కా హిందూ అని చెప్పారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో తిరుమలపై తప్పుడు ప్రచారం జరిగితే సుబ్రహ్మణ్య స్వామి వెంటనే స్పందిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాపై కేసు వేస్తా అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.